రాప్తాడు రూరల్: రాయల్టీ అధికారులమంటూ బెదిరించి డబ్బు గుంజేందుకు ప్రయత్నించిన దుండగులు చివరకు పోలీసులు పట్టుబడ్డారు. వివరాలు... తాడిపత్రి ప్రాంతానికి చెందిన ఓ ట్రాక్టర్ ఈ నెల 8న కళ్యాణదుర్గం వైపు నల్ల బండల లోడుతో వెళుతుండగా రాత్రి 11 గంటలకు అనంతపురం రూరల్ మండలం కురుగుంట దాటగానే సంతోష్‌నగర్ వద్ద ముగ్గురు వ్యక్తులు అటకాయించారు. తాము రాయల్టీ అధికారులమంటూ డ్రైవర్‌ను బెదిరించారు. భయపడిన డ్రైవర్ ట్రాక్టర్ దిగడంతో దుండగుల్లో ఒకరు ట్రాక్టర్ ఎక్కి పక్కకు పెట్టే ప్రయత్నం చేశాడు. ఆసమయంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో చాలా బండలు విరిగిపోయాయి. ఇంతలో దుండగులు డ్రైవర్‌ను బెదిరించి సెల్‌ఫోన్, డబ్బులు లాక్కొన్నారు. అటుగా వెళ్తున్న కొందరు అనుమానం వచ్చి సమాచారం అందించడంతో రూరల్ పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని దుండగులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురూ చిన్నంపల్లి పంచాయతీ సజ్జలకాలవ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితులపై సీఐ రామకృష్ణారెడ్డి న్యూసెన్స్ కేసు నమోదు చేసి, బాధితుడికి నష్టపరిహారం ఇప్పించారు.