పుట్టపర్తి అర్బన్: ‘జగనన్నకు చెబుదాం’ మండల స్థాయి కార్యక్రమం డిసెంబర్ 1వ తేదీ (శుక్రవారం) పెనుకొండలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అరుణ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం వారంలో ప్రతి బుధ, శుక్రవారాల్లో మండల కేంద్రాల్లో స్పందన, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే 1వ తేదీ పెనుకొండ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. భువన విజయం సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, మండలస్థాయి అధికారులు పాల్గొంటారని ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.
7న మడకశిరలో సామాజిక సాధికార బస్సుయాత్ర
మడకశిర: బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నాలుగున్నరేళ్ల పాలనలో చేసిన మేలు వివరించేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర డిసెంబర్ 7న మడకశిరలో కొనసాగుతుందని ఎమ్మెల్యే తిప్పేస్వామి తెలిపారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పార్టీ పరిశీలకులు పోకల అశోక్‌కుమార్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు భారీగా తరలివచ్చి బస్సుయాత్రను విజయవంతం చేయాలని కోరారు. అలాగే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు.