
హుండీ నగదు లెక్కిస్తున్న దృశ్యం
ఉరవకొండ: ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి 2023–24 సంవత్సరానికి గాను శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ మోసేనురాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభ్యుల గౌరవాధికారాలకు ఎవరు భంగం కలిగించినా, ప్రొటోకాల్ విషయంలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినా విచారణ జరిపి చర్యలు తీసుకునేలా ప్రివిలేజ్ కమిటీ పని చేస్తుందన్నారు. చైర్మన్‌గా నియమితులైన వై.శివరామిరెడ్డికి ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు బుక్కపట్నంలో
‘జగనన్నకు చెబుదాం’
పుట్టపర్తి: జిల్లా కేంద్రానికి రాలేని వారి కోసం మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న ‘జగనన్నకు చెబుదాం’ మండల స్థాయి స్పందన కార్యక్రమం బుధవారం బుక్కపట్నంలో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బుక్కపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందున్న షాదీఖానాలో నిర్వహించే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారని తహసీల్దార్ కరుణాకర్, ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యపై అర్జీలు ఇచ్చుకోవాలని సూచించారు.
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.64.27 లక్షలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా రూ.64.27 లక్షల ఆదాయం లభించినట్లు ఈవో వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారికి హుండీ ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారం చేపట్టారు. 43 రోజులకు గానూ హుండీల ద్వారా రూ.64,27,361 నగదుతో పాటు అన్నదాన హుండీ ద్వారా రూ.21,844 అందిందన్నారు. అలాగే 0.01 మి.గ్రా. బంగారు, 2.58 కిలోల వెండిని కానుకల రూపంలో భక్తులు స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆర్టీసీ సేవాసమితి సభ్యులు, బళ్లారికి చెందిన వీరభద్రసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
టైలరింగ్, జర్ధోసి మగ్గం వర్క్‌పై ఉచిత శిక్షణ
అనంతపురం: ఉమెన్స్ టైలరింగ్, జర్ధోసి మగ్గం వర్క్‌పై ఎస్కేయూనివర్సిటీ సమీపంలోని రూడ్‌సెట్‌లో మహిళలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రూడ్‌సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 11వ తేదీ నుంచి నెల రోజుల పాటు కొనసాగే శిక్షణకు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ నిరుద్యోగ మహిళలు అర్హులు. శిక్షణా కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తారు. పూర్తి వివరాలకు 83099 15577, 96188 76060లో సంప్రదించవచ్చు.
21 మండలాల్లో వాన
పుట్టపర్తి అర్బన్: జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 21 మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పుట్టపర్తి మండలంలో 41.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక కొత్తచెరువు 24.8, తాడిమర్రి 19.2, ముదిగుబ్బ 15.4, కదిరి 13.2, సీకేపల్లి 12.6, తలుపుల 10.4, నల్లమాడ 8.6, అగళి 8.6, ఓడీచెరువు 8.4, చిలమత్తూరు 8.2, రొళ్ల 7.4, బుక్కపట్నం 7.2, రామగిరి 5.4, బత్తలపల్లి 5.2, తనకల్లు 4.6, కనగానపల్లి 4.2, నల్లచెరువు 3.2, హిందూపురం 3.2, ధర్మవరం 2.6, గాండ్లపెంట 2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. తాజా వర్షాలు ఖరీఫ్ పంటలకు కొంత ఊరటనిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

