
పుట్టపర్తి అర్బన్: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’తో నిరుపేదలకు ఇళ్ల వద్దే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని కలెక్టర్ అరుణ్‌బాబు తెలిపారు. వైద్య సిబ్బందే ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారని, ఏదైనా జబ్బు ఉన్నట్లు గుర్తిస్తే ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు పంపి మెరుగైన వైద్యం అందేలా చూస్తారన్నారు. ‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు పైలెట్ గ్రామంగా ఎంపికై న పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది 40 మందికిపైగా పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. శిబిరాన్ని కలెక్టర్ అరుణ్‌బాబు, ఆర్డీఓ భాగ్యరేఖ, రాష్ట్ర కోఆర్డినేటర్, డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్, డీఎంహెచ్‌ఓ ఎస్వీ కృష్ణారెడ్డి, డీసీహెచ్‌ఎస్ తిప్పేంద్రనాయక్ తదితరులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సచివాలయాల నోడల్ ఆఫీసర్ శివారెడ్డి, ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీనరసమ్మ, సర్పంచ్ లక్ష్మీనరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ..రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే ప్రతి గ్రామంలోన పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించడానికి ‘జగనన్న ఆరోగ్య సురక్ష’కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. ఇందులో భాగంగా 10 రోజుల నుంచి వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రాథమిక రక్త పరీక్షలు నిర్వహించారని, జబ్బులబారిన పడిన వారికి టోకెన్లు అందజేసి వైద్య శిబిరానికి తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ప్రతి సచివాలయం పరిధిలోనూ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాలు నిర్వహిస్తారని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ వైద్య శిబిరంలో నలుగురు స్పెషలిస్ట్ వైద్యులు, టెక్నీషియన్లు, 40 మందికి పైగా వైద్య బృందం అందుబాటులో ఉంటుందన్నారు.
ప్రతి రోగికీ కేస్‌షీట్..
‘జగనన్న ఆరోగ్య సురక్ష’లో భాగంగా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ప్రతి రోగికీ ఒక కేస్‌షీట్ తయారు చేస్తున్నారు. అందులో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల వివరాలు, రోగి రక్త నమూనాలు, జబ్బు వివరాలు, వారికి అందించిన మందులు, సూది మందు వివరాలు, తినే ఆహారం, తినకూడని ఆహారం, క్యాల్షియం, ఇరన్ మాత్రలు అందిస్తే వాటి వివరాలు... ఇలా ప్రతి ఒక్కటీ అందులో వివరంగా నమోదు చేస్తున్నారు. దీంతో సదరు వ్యక్తి ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఈ కేస్‌షీట్ తీసుకువెళ్తే చాలు అక్కడి వైద్యుడి రోగి ప్రస్తుత పరిస్థితి సులభంగా అర్థమై వైద్యం అందించడం చాలా సులభమవుతుంది.
నిరుపేదల ఆరోగ్యంపై
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
కలెక్టర్ అరుణ్‌బాబు వెల్లడి
జగనన్న సురక్ష పైలెట్ ప్రోగ్రాం కింద జగరాజుపల్లిలో వైద్య శిబిరం
40 మంది వైద్య బృందంతో
గ్రామస్తులకు వైద్య సేవలు
53 రకాల పరీక్షలు.. 150 రకాల మందులు
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడితో కూడుకున్న విధులతో చాలా మంది జబ్బుల బారిన పడుతున్నారన్నారు. కొందరికి తాము అనారోగ్యం బారిన పడిన విషయం కూడా తెలియడం లేదన్నారు. పరిస్థితి విషమించినప్పుడు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారని, ఆ సమయంలో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందన్నారు. అందువల్లే రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య సిబ్బందిని ఇంటింటికీ పంపి పరీక్షల చేయిస్తూ...వ్యాధుల బారిన పడిన వారిని గుర్తిస్తోందన్నారు. దీనివల్ల ఏదైనా జబ్బు ఉన్నట్లు తెలిస్తే ప్రాథమిక దశలోనే వైద్యం అందించి నయం చేయవచ్చన్నారు. ‘జగనన్న ఆరోగ్య సురక్ష’లో 53 పరీక్షలు ఉచితంగా చేస్తారని, అవసరమైన వారికి 150 రకాల మందులను సైతం ఉచితంగా అందజేస్తారన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారికి నెలకు సరిపడా మందులు అందజేస్తారన్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ద్వారా వైద్యం అందిస్తారన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఆరోగ్య శ్రీ ద్వారా 3,200కుపైగా వ్యాధులకు ఉచిత వైద్యం అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శుభదాస్, డీపీఓ విజయ్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సెల్వియా, ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి, ప్రజా ఆరోగ్య అధికారి వీరమ్మ, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి, తహసీల్దార్ నవీన్‌కుమార్, ఈఓఆర్డీ అశోక్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ మాజీ మండల కన్వీనర్ గంగాద్రి, నాయకులు మల్లిరెడ్డి, రమణారెడ్డి, సురేంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.

