● మాజీ మంత్రి పరిటాల సునీత అడ్మిషన్‌తో హంగామా
అనంతపురం మెడికల్: టీడీపీ నాయకుల హంగామా రోగులకు ఇబ్బంది కలిగించింది. అత్యవసర వైద్యం కోసం అంబులెన్సుల్లో తీసుకొచ్చిన రోగులను క్యాజువాలిటీలోకి తీసుకెళ్లేందుకు దారి లేకుండా అడ్డుగా నిల్చున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం సర్వజనాస్పత్రి క్యాజువాలిటీలో చేర్చారు. ఇదే క్రమంలో మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌తో పాటు కార్యకర్తలు ఆస్పత్రిలోకి చొరబడ్డారు. కార్లు, ద్విచక్ర వాహనాలను ఇష్టారాజ్యంగా పార్క్ చేశారు. దీంతో 108 అంబులెన్స్‌లు లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. అంబులెన్స్‌లో వచ్చిన రోగులను అతికష్టం మీద క్యాజువాలిటీకి తరలించారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రి ఆవరణలో నినాదాలు చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. చివరకు మాజీ మంత్రి పరిటాల సునీత డిశ్చార్జ్ అయ్యాక వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.