
● హాజరుకానున్న
522 మంది అభ్యర్థులు
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో గ్రూప్–1 సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు శనివారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు జరగనున్నాయని కలెక్టర్ గౌతమి శుక్రవారం తెలిపారు. జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు 522 మంది అభ్యర్థులు హాజరవుతాన్నారు. రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల నుంచి 9.45 గంటలలోపు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరవ్వాలన్నారు. కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఐటీ గాడ్జెట్లు, బ్లూటూత్, ఇతర కమ్యూనికేషన్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోరన్నారు.
15 వరకూ
‘జన్ భాగిదారి’ వేడుకలు
ప్రశాంతి నిలయం: ‘నిపుణ్ భారత్’లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ వరకూ ‘జన్ భాగిదారి’ వేడుకలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి మహేంద్ర రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన సమగ్రశిక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వేడుకల్లో భాగంగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల కోసం వివిధ రకాల కార్యక్రమాలు (రంగోలి, పద్యపఠనం, క్విజ్, చిత్రలేఖనం, కథలు చెప్పడం, వక్తృత్వ పోటీలు) రూపొందించామన్నారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల చేత నిపుణ్ భారత్ ప్రతిజ్ఞ చేయించాలన్నారు. ప్రతి మండల విద్యాధికారి ఆయా మండలాల్లోని ప్రాథమిక పాఠశాలలను సందర్శించి అక్కడ బోధన, అభ్యసన సామగ్రిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించాలన్నారు. ఇందుకోసం ఈనెల 4వ తేదీలోపు 1 నుంచి 3వ తరగతి పిల్లలకు 7 విభాగాల్లో పోటీలు నిర్వహించాలన్నారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరచి వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
మడకశిరలో
5న జిల్లాస్థాయి ‘స్పందన’
పుట్టపర్తి అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే జిల్లా స్థాయి ‘స్పందన’ కార్యక్రమాన్ని వచ్చే సోమవారం (5వ తేదీ) మడకశిరలో నిర్వహించనున్నట్లు డీఆర్‌ఓ కొండయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ అరుణ్‌బాబు సమక్షంలో మడకశిరలోని అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించే జిల్లా స్థాయి స్పందనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా హాజరుకావాలని, గైర్హాజరైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
పింఛన్ పంపిణీ
95 శాతం పూర్తి
పుట్టపర్తి అర్బన్: ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ పంపిణీ జిల్లాలో జోరుగా సాగుతోంది. గురువారం తెల్లవారుజాము నుంచే ఇంటింటికీ వెళ్లి పింఛన్ కానుక అందజేసిన వలంటీర్లు రెండోరోజు శుక్రవారం పింఛన్‌దారులు ఎక్కడుంటే అక్కడికే వెళ్లి పింఛన్ కానుక మొత్తాన్ని అందజేశారు. ఫలితంగా శుక్రవారం నాటికి జిల్లాలో పింఛన్ పంపిణీ 95 శాతం పూర్తయ్యింది. జిల్లాలో 2,62,688 మంది పింఛన్ లబ్ధిదారులుండగా, ప్రభుత్వం రూ.72,94,67,000 మంజూరు చేసింది. ఇందులో ఇప్పటివరకూ 2,47,882 మందికి రూ. 68,80,82,750 మొత్తాన్ని అందజేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య తెలిపారు. ఈ క్రమంలో పింఛన్ పంపిణీలో రాష్ట్రంలోనే శ్రీసత్యసాయి జిల్లా 6వ స్థానంలో నిలిచిందన్నారు. పింఛన్ పంపిణీకి మరో మూడు రోజుల గడువు ఉందని, ఆలోపు మిగతా వారికీ ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ అందజేస్తామన్నారు.

దిగువచెర్లోపల్లిలో పింఛన్ అందజేస్తున్న వలంటీర్ సుదర్శన్

కలెక్టర్ గౌతమి