
లోకేష్ ట్విట్టర్‌లో పోస్టు చేసిన దృశ్యం
ఓడీచెరువు: తన అజ్ఞానాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగు పదాలను సరిగా పలకలేక, సమయం.. సందర్భం లేకుండా ఏది మాట్లాడుతున్నాడో కూడా తెలియక ఇప్పటికే అనేక సార్లు నవ్వులపాలైన లోకేష్.. ప్రభుత్వంపై నింద వేద్దామని ప్రయత్నించి మరోసారి ప్రజలందరి చేత ‘మాలోకం’ అనిపించుకున్నారు. ఓడీ చెరువులో త్వరలో ప్రధాన రహదారి పక్కనే ‘ఫిష్ ఆంధ్ర’ చేపల మార్కెట్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాను చేపట్టిన పాదయాత్రలో భాగంగా శనివారం అటువైపు వచ్చిన లోకేష్ ఫిష్ ఆంధ్ర చేపల మార్కెట్ బోర్డును చూసి సెల్ఫీ తీసుకున్నాడు. అంతటితో ఆగక తన ట్విట్టర్ ఖాతాలో చేపల దుకాణం మూతపడిందంటూ పోస్టు చేశారు. ఇంకా ప్రారంభమే కాని దుకాణాన్ని మూసివేశారంటూ ఆయన చేసిన ప్రచారాన్ని చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ విషయంపై ఓడీ చెరువు చేపల సొసైటీ సభ్యులు మండోజీ ఆరీఫ్‌ఖాన్ మాట్లాడుతూ లోకేష్‌కు మతిభ్రమించి ఇలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది పోస్టు చేసి అవివేకాన్ని మరో సారి బయటపెట్టుకున్నారన్నారు.