
పుట్టపర్తి: ప్రజల మనసులు గెలుచుకుని వారి మద్దతుతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత దొడ్డిదారిన చట్టసభలోకి వచ్చిన లోకేష్‌కు లేదని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి దుయ్యబట్టారు. పాదయాత్రకు పెయిడ్ ఆర్డిస్ట్‌లను తెప్పించుకుని ప్రజలను మభ్యపెట్టడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. సీఎం జగన్ పవర్ గురించి చంద్రబాబును అడిగితే చెబుతారని సూచించారు. లోకేష్ పిల్లచేష్టలు వీడితే మంచిదని హితవు పలికారు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఆదివారం ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఓడీచెరువులో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక పుట్టపర్తి అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు.
టీడీపీ హయాంలో నియోజకవర్గ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఈ విషయంపై నారా లోకేష్‌కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. టైం, డేట్ ఫిక్స్ చేసుకోవాలని సూచించారు. 31న ఉదయం సత్యమ్మ ఆలయం వద్దకు చర్చకు వస్తానని, మీరు రాకుంటే అదే రోజు సాయంత్రం పుట్టపర్తి టీడీపీ కార్యాలయానికి కూడా రావడానికి సిద్ధమేనన్నారు. లేదంటే ఒకటో తారీఖునైనా వస్తానని, ఆ రోజు రాకుంటే రెండో తేదీ లోకేష్ ఎక్కడైతే బస చేస్తాడో అక్కడికే వస్తానని ప్రకటించారు. అవినీతి, దందాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో రూ.వందల కోట్లు అక్రమంగా వెనకేసుకుని అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అన్నారు. మంగళగిరికి మందలగిరి అని నామకరణం చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మికవేత్త సత్యసాయి బాబా పేరును కూడా సరిగా ఉచ్ఛరించలేని వ్యక్తి పుట్టపర్తి అభివృద్ధిపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు.
లోకేష్‌లాగా దొడ్డిదారిన తాను పదవిలోకి రాలేదని, ప్రజలతో మమేకమై వారి మద్దతుతో గెలిచిన వ్యక్తినని తెలిపారు. ప్రజలకు ఎరవేసి బలవంతంగా రప్పించుకుని చేసేది పాదయాత్ర కాదని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ నాయకుడు చేసిన ప్రజాసంకల్పయాత్ర వీడియోలను చూసి లోకేష్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. పల్లె రఘునాథరెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం కాదని, ఇక్కడి పరిస్థితులను అవగతం చేసుకొని మాట్లాడాలని సూచించారు.‘పల్లె’ మంత్రిగా ఉన్న సమయంలో చిత్రావతి నదిపై చెక్ డ్యామ్ పేరుతో కోట్ల రూపాయల ఇసుక దోపిడీ జరిగిందని గుర్తు చేశారు.
ఇదీ మేం చేసిన అభివృద్ధి..
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే వివరించారు. తమ ప్రభుత్వంలో ముదిగుబ్బ నుంచి బుక్కపట్నం, పుట్టపర్తి మీదుగా 342 జాతీయ రహదారి ఏర్పాటవుతోందన్నారు. బెంగళూరు నుంచి విజయ వాడ వరకు గ్రీన్ ఫీల్డు హైవే మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటికే రూ.1,800 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఇవి కాకుండా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సుమారు రూ. 150 కోట్లతో సిమెంట్ రోడ్లు వేయించామన్నారు. త్వరలోనే 193 చెరువులకు నీళ్లు నింపే పనులను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
జగనన్న కాలనీల్లో 25 వేలకు పైగా గృహ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్ సహకారంతో పుట్టపర్తిలో యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృిషి చేస్తున్నామని, ఇప్పటికే ఏపీఐఐసీ ఆధ్వర్యంలో వసతుల కల్పన పనులు జరుగుతున్నాయన్నారు. ఇవేవీ లోకేష్‌కు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. పుట్టపర్తి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు కట్టించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కిందన్నారు. ఈ విషయాలన్నింటిపై పల్లె రఘునాథరెడ్డి, లోకేష్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. త్వరలో తాను పాదయాత్ర చేపడుతున్నానని, అప్పుడు ప్రజలు ఎలా ఆశీర్వదిస్తారో చూడాలని పేర్కొన్నారు.