నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని బీసీ హాస్టళ్లలో ఉండి చదువుకున్న పదో తరగతి విద్యార్థులు ఫలితాల్లో ప్రతిభ చూపిన నేపథ్యంలో, అందుకు కృషి చేసిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి.వెంకటలక్ష్మికి పురస్కారం లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అభినందన కార్యక్రమంలో ఆమె బీసీ వెల్ఫేర్ మంత్రి సవిత చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు. జోనల్ స్థాయిలో ఆత్మకూరు రిటైర్డ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఐ.కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. జిల్లాలోని 19 హాస్టళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం, 99 మంది 500కుపైగా మార్కులు, 25 మంది 550 మార్కులు సాధించేందుకు విశేష కృషి చేసినందుకు అవార్డులు దక్కాయి.


