దర్జాగా ఇసుక దందా | - | Sakshi
Sakshi News home page

దర్జాగా ఇసుక దందా

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

చేజర్ల: మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నాగేశ్వరాలయం నది ఒడ్డున ఉండేది. వరదలకు ఆ గుడి కాస్త ఇసుకతో కప్పబడింది. 20 అడుగుల మేర ఇసుకమేట ఏర్పడింది. నాలుగేళ్ల క్రితం గ్రామ యువత ఆలయాన్ని వెలికితీయాలని సంకల్పించారు. గోపురం కొంతమేర బయటకు కనపడేలా ఇసుకను తీశారు. ఆర్థిక చేయూత కోసం ఈ గుడి దేవదాయ శాఖ పరిధిలో ఉండడంతో గ్రామస్తులు సంబంధిత అధికారులను ఆశ్రయించారు. అధికార గణంతో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. ఆలయాన్ని వెలికితీసి పునర్ని ర్మిస్తామని హామీ ఇచ్చారు.

మా ఇష్టం

మంత్రి ముఖ్య అనుచరులు ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లోని టన్నుల ఇసుకను మాయం చేశారు. కొద్దినెలలుగా ఆలయ ప్రాంగణంలోని ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పేరుకేమో ఆలయాన్ని వెలికి తీస్తున్నామని అభివృద్ధికి సహకరిస్తున్నామని చెబుతూ దేవుడి భూముల్లో ఉన్న సహజ సంపదను భారీగా దోపిడీ చేస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ తంతు మంత్రి కనుసన్నల్లోనే జరుగుతోందని, అందువల్లే దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోయిందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

సందర్శకులను ఆపి..

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఇసుక గర్భం నుంచి వెలికి తీశారన్న విషయం సోషల్‌ మీడియా ద్వారా రాష్ట్రమంతటా వ్యాపించింది. రోజూ వందలాది మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు వారి తాకిడి ఆటంకం కలిగిస్తోందని భావించారు. అధికార దర్పంతో ఎండోమెంట్‌, పోలీస్‌ అధికారుల చేత భక్తులెవరూ ఈ ప్రాంతానికి రావొద్దని, పనులు జరుగుతున్నాయని ప్రకటన ఇప్పించారు. భారీ యంత్రాలతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను దోపిడీ చేస్తున్నారు.

ఎందుకు స్పందించడం లేదో..

రోజూ భారీ యంత్రాలు ఇసుకను తోడేస్తుండగా పెద్ద వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండటంతో రోడ్లు దెబ్బ తినడంతోపాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయినా మైనింగ్‌, ఎండోమెంట్‌ అధికారులు ఆ వైపున కన్నెత్తి కూడా చూడటం లేదని పెరుమాళ్లపాడు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. మంత్రి ముఖ్య అనుచరులు కావడంతో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ అభివృద్ధి ఏమో గానీ స్వామికి చెందాల్సిన ఇసుకను ప్రైవేట్‌ వ్యక్తులు దోచుకుంటూ శఠగోపురం పెడుతున్నారు.

పెరుమాళ్లపాడు నాగేశ్వరస్వామి సాక్షిగా అపచారం

గుడి వెలికితీత మాటున భారీగా

ఇసుక దోపిడీ

దేవదాయ శాఖ మంత్రి

ముఖ్య అనుచరుల ఇష్టారాజ్యం

ఆ వైపు కన్నెత్తి చూడని అధికార గణం

తెలుగు తమ్ముళ్ల అరాచకాలకు అడ్డు

లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. పెన్నా నది ఇసుకమేటతో కాలగర్భంలో కలిసిన ఆలయం వెలికితీత పేరుతో అక్రమ దందా జరుగుతోంది. గుడిని కప్పబడి ఉన్న ఇసుకతోపాటు పరిసర ప్రాంతాల్లోని టన్నుల కొద్దీ ఇసుకను దేవదాయ శాఖ మంత్రి అనుచరులు అక్రమంగా తరలిస్తున్నారు. భక్తులు ఇదేమి ఘోరం స్వామి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

Advertisement
 
Advertisement
Advertisement