రైతులను హింసిస్తున్న బాబు సర్కారు | - | Sakshi
Sakshi News home page

రైతులను హింసిస్తున్న బాబు సర్కారు

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

నెల్లూరు (వీఆర్సీసెంటర్‌): చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల అభివృద్ధి, సంక్షేమమే కాకుండా.. భద్రత కూడా కొరవడిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించమని ఉద్యమించిన రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించి ప్రాణాలు తీశారని, ఇప్పుడు విద్యుత్‌ కనెక్షన్‌ అడిగితే.. పోలీసులతో కొట్టించి ఆ దృశ్యాలను వీడియో కాల్‌ ద్వారా చూస్తూ టీడీపీ నేతలు పైశాచికానందాన్ని పొందారంటూ మండిపడ్డారు. రైతులకు ఎరువులు, సాగునీరు అందించడం, గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు సంక్షేమ పథకాలను అందించే విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వ మోసం చేస్తోందని ఆరోపించారు. మంగళ వారం విద్యుత్‌భవన్‌లో ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ రాఘవేంద్రంను కలిసి రైతులకు వ్యవసాయ విద్యుత్‌ సర్వీసు మంజూరులో జరుగుతున్న అవినీతి, రాజకీయ జోక్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యాతా క్రమంలో విద్యుత్‌ సర్వీసులు మంజూరు చేయాలని అడిగితే రైతులను పోలీసులతో కొట్టించడం, ఇదేమని ప్రశ్నించిన వారితోపాటు తనపై పోలీసు కేసులు పెట్టటం చూస్తుంటే రాష్ట్రంలో రైతులపై ఎంతటి దమనకాండ జరుగుతోందో తెలుస్తోందన్నారు.

రెండేళ్లుగా కనెక్షన్‌ ఇవ్వని అధికారులు

కాకు పెంచలయ్య అనే రైతు 2024 జూలై 11వ తేదీ వ్యవసాయ విద్యుత్‌ సర్వీసు కోసం విద్యుత్‌శాఖకు నగదు చెల్లించినా.. రెండేళ్లుగా కనెక్షన్‌ ఇవ్వలేదని, 3 నెలల క్రితం దరఖాస్తు చేసిన వారికి కనెక్షన్‌ ఇవ్వడం ఏమిటని కాకాణి ప్రశ్నించారు. ఏఈలు లంచాలు తీసుకుని ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారని, ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే, టీడీపీ వారికి కోపమెచ్చి లంచాలు తీసుకుంటున్న అధికారులకు వత్తాసు పలుకుతూ ప్రెస్‌మీట్‌లు పెట్టటం శోచనీయమన్నారు. హరికృష్ణ అనే రైతును కొట్టిన ఎస్సైపై చర్యతీసుకోవాలని డీఎస్పీకు ఫిర్యాదు చేశామని, అయితే ఆయనపై చర్య తీసుకుంటారన్న నమ్మకం తమకు లేదన్నారు. ఆ ఎస్సైకు సీఐగా ప్రమోషన్‌ ఇచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ఎస్సై పోలీసు చరిత్ర 2029తో ముగుస్తుందన్నారు.

ఈ పోరాటం ఇంతటితో ఆగదు

రైతులకు వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు మంజూరు చేసే విషయంలో మితిమీరిన రాజకీయ జోక్యం, అధికారుల అవినీతిపై తాము చేస్తున్న పోరాటం ఇంతటితో ఆగదని కాకాణి హెచ్చరించారు. పొదలకూరు మండలం నావూరుపల్లిలో హరికృష్ణ అనే రైతు విషయంలో విద్యుత్‌ శాఖాధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. వ్యవసాయ కనెక్షన్ల విషయంలో ఇష్టారీతిగా వ్యవహరిస్తే.. చూస్తూ ఊరుకోబోమన్నారు. రైతులకు జరిగిన అన్యాయంపై, అకారణంగా పోలీసులు కొట్టటంపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అవసరమైతే మానవ హక్కుల సంఘానికి, పౌరహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై చేయిపడితే..

జిల్లాలో ఏ ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్తపైనా దాడి జరిగినా సహించేది లేదని కాకాణి హెచ్చరించారు. మహానాడుకు వచ్చే టీడీపీ నాయకులు ఫొటోలకు ఫోజులు ఇస్తూ తమను తిట్టి వెళ్తుతున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు కానీ రైతులకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా.. పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పార్టీ సిద్ధంగా ఉన్నారన్నారు.

ఈ సారి అన్ని స్థానాల్లో

వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌

నిత్యం ప్రజల మధ్య తిరిగే తనకు ప్రజల నాడీ తెలుసునని ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఉందని, ఇప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినా ఉమ్మడి జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు వైఎస్సార్‌సీపీ కై వసం చేసుకోవడం తథ్యమని కాకాణి స్పష్టం చేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేని, దొడ్డి దారిలో ఎమ్మెల్సీ అయిన బీద రవిచంద్ర వంటి వాళ్లు కూడా మా పార్టీ గెలుపు గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. అంత ధైర్యం ఉంటే ఎన్నికలు జరపాలని సవాల్‌ విసిరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీరాష్ట్ర సెక్రటరీ చిల్లకూరు సుధీర్‌రెడ్డి, నాయకులు వెంకటశేషయ్య,ఇంద్రసేనగౌడ్‌, పెంచలరెడ్డి, సురేంద్రబాబు, హరగోపాల్‌రెడ్డి, శంకరయ్యగౌడ్‌, సురేష్‌కుమార్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రైతులు, తదిత రులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై

చేయి పడితే సహించేది లేదు

జిల్లాలో 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ

స్థానాలు వైఎస్సార్‌సీపీకే..

తప్పులు చేసే ఏ అధికారిని

వదిలిపెట్టబోము

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement