నీట్‌గా ఆశలు సమాధి | - | Sakshi
Sakshi News home page

నీట్‌గా ఆశలు సమాధి

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

నెల్లూరు (టౌన్‌): కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేషనల్‌ ఎలిజిబులిటీ కం ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నీట్‌) నిర్వహణ లోపభూయిష్టంగా మారి అపహస్య పాలవుతుంది. వైద్య వృత్తిలో రాణించాలనే ఆశలు పెట్టుకున్న వేలాది మంది విద్యార్థుల ఆశలను సమాధి చేస్తున్నారు. గతేడాది పరీక్ష కేంద్రాల్లో సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడం, మరో వైపు గాలివాన బీభత్సంతో ఏ విద్యార్థి పరీక్షను రాయలేకపోయారు. ఈ ఏడాది చూస్తే.. ఏకంగా ప్రశ్నపత్రం లీకేజ్‌ కావడంతో పరీక్షనే కేంద్రం రద్దు చేయడంతో నీట్‌పై ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు శరాఘాతంగా మారింది.

జిల్లాలో 3486 మంది విద్యార్థులు

జిల్లా లాంగ్‌, షార్ట్‌ టర్మ్‌ల్లోనూ నీట్‌కు ప్రిపేర్‌ అయిన విద్యార్థులు ఈ దఫా తమ ప్రతిభను చాటుకుందామని ఆకాంక్షతో ఈనెల 3వ తేదీ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాలో జరిగిన పరీక్షకు 3486 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించారు. ఎన్డీఏ తాజా ప్రకటనతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు హతాశులయ్యారు.

నీట్‌ నిర్వహణపై ఆగ్రహం

నీట్‌ను నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్ట్‌ ఏజెన్సీపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2024లో నిర్వహించిన నీట్‌ ప్రశ్నపత్రం బీహార్‌లో లీక్‌ కావడంతో అప్పుడు తొలుత ప్రకటించిన ర్యాంకుల జాబితాను రద్దు చేసి రెండో సారి ర్యాంకులు ప్రకటించారు. ఆ సమయంలో ఎంతో మంది విద్యార్థుల ర్యాంకులు మారడంతో ఆ విద్యా సంవత్సరం నష్టపోయారు. తాజాగా నీట్‌ పరీక్షను రద్దు చేయడంతో కచ్చితంగా మెడికల్‌ సీటు వస్తుందని ఆశ పడిన విద్యార్థులు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ సారి నిర్వహించబోయే నీట్‌ పరీక్షలో ర్యాంకు వస్తుందో లేదో అనే ఆందోళన వారిలో నెలకొంది. నీట్‌ పరీక్ష కూడా ఎప్పుడు ఉంటుందో కూడా ప్రకటించలేదు. ఇప్పటికే పరీక్ష రాసి ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడంతో తీవ్ర అసంతృప్తి గురవుతున్నారు. నీట్‌ నిర్వహణపై కూడా విద్యార్థులు తల్లిదండ్రులు మండి పడుతున్నారు. బాధ్యత లేకుండా పరీక్ష నిర్వహించడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

పరీక్ష రద్దు బాధాకరం

నీట్‌ రద్దు చేయడం బాధాకరం. మా పాప నీట్‌ రాసింది. మైనార్టీ కోటాలో తప్పనిసరిగా ఎంబీబీఎస్‌ సీటు వస్తుందని భావిస్తున్నాం. ఒకవేళ అక్కడ మిస్‌ అయినా బీడీఎస్‌ సీటు వస్తుంది. నీట్‌ రద్దుతో తీవ్ర నిరాశకు గురవుతున్నాం. ఈ సారి నిర్వహించబోయే పరీక్షలో ర్యాంకు వస్తుందో లేదోనన్న టెన్షన్‌లో ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్‌ పరీక్షపై నిర్లక్ష్యం బాధాకరం.

– బీబీ జాన్‌, విద్యార్థిని తండ్రి

నిరాశ.. ఆందోళనగా ఉంది

నీట్‌ రద్దు చేయడంతో నిరాశ, ఆందోళనకు గురవుతున్నాను. నీట్‌ కోసం ప్రిపేర్‌ అయి పరీక్ష బాగా రాశా. నీట్‌ సంస్థ విడుదల చేసిన కీ ఆధారంగా కచ్చితంగా నాకు ర్యాంకు వస్తుంది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు వస్తుంది. అయితే తాజాగా ఈ పరీక్షను రద్దు చేయడం వల్ల నష్టపోతున్నా. ఈ సారి నిర్వహించబోయే పరీక్షలో ఏ పాటి ర్యాంకు వస్తుందో లేదోనన్న టెన్స్‌న్‌లో ఉన్నా.

– తేజశ్రీ, విద్యార్థిని

ఒత్తిడికి లోనవుతాం

నీట్‌ రద్దు చేయడం వల్ల ఏడాదంతా పడిన కష్టం.. మళ్లీ నీట్‌ జరిపితే ఫలితాల్లో నాకు ర్యాంకు వస్తుందో రాదో తెలియక, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను. మంచి ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరుతానని భావించా. నీట్‌ రద్దుతో అది కలగా మారింది. ముందు పరీక్షలో సీటు వస్తుందని ఆశ ఉంది. మళ్లీ పరీక్షలో ర్యాంక్‌ వస్తుందో రాదో తెలియదు.

– రూపేష్‌, విద్యార్థి

తీవ్ర నిరుత్సాహమే

నీట్‌ రద్దు కావడం తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. నా కుమార్తె వర్ష ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు చదివింది. పరీక్ష బాగా రాసింది. కీ చెక్‌ చూసుకుంటే 510 మార్కులకు పైగా వస్తున్నాయి. ఈ మార్కులతో ఎంబీబీఎస్‌ సీటు వస్తుందన్న ఆశలున్నాయి. ఇప్పుడు పరీక్ష రద్దు చేశామంటున్నారు. మళ్లీ పరీక్షల వరకు చదివితే.. ఈ సారి వచ్చే ప్రశ్నపత్రంతో ఇన్ని మార్కులు వస్తాయా? అనేది అనుమానంగా ఉంది.

– పందిపాటి ఉదయ్‌కుమార్‌, నీట్‌ విద్యార్థిని తండ్రి, కోవూరు

ప్రశ్నపత్రం లీక్‌.. పరీక్ష రద్దుతో

విద్యార్థుల్లో ఆందోళన

ఏళ్లుగా కష్టపడి చదివిన పిల్లల

భవిష్యత్‌ను చిదిమేయడమే

ఫ్రీ సీట్లు వస్తాయనే ఆనందంపై నీళ్లు

విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినడంపై తల్లిదండ్రుల ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement