పొదలకూరు: వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్‌బాబు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నావూరుపల్లి గ్రామానికి చెందిన గాలం హరికృష్ణ ఆయన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు నిర్వహించిన మీడియా సమావేశంలో తనను బెదిరించే విధంగా మాట్లాడారన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుట కాకాణి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన వైఎస్సార్‌సీపీ మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించి కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో గాలం హరికృష్ణ తనపై పోలీసులు చేయి చేసుకున్న అంశాన్ని ప్రస్తావిస్తూ టీడీపీ నాయకులు తనను కొట్టించారని చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. దీంతో టీడీపీ నాయకుడు ప్రాణహాని ఉందని పోలీసులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
యూట్యూబ్ చానల్
రిపోర్టర్ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలో టీడీపీలోని ఓ మహిళా నేత విజేతరెడ్డి డాన్‌గా వ్యవహరిస్తుందంటూ 9 టీవీ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ రమణారెడ్డి ప్రసారం చేసిన కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సదరు మహిళా నేత ఈ నెల 7న బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు రూ.5 కోట్ల పరువు నష్టం కేసును వేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ మహిళా నేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రమణారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 78,985 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,761 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.55 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
నేడు జెడ్పీ స్థాయీ
సంఘాల సమావేశాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి జెడ్పీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశాలు జరుగుతాయన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, విద్యుత్, జిల్లా వ్యవసాయం, పశు సంవర్థకం, మత్స్య, విద్యా, వైద్య ఆరోగ్యం, ఐసీడీఎస్, ఐటీడీఏ, మైనార్టీ సంక్షేమం, జిల్లా మైనార్టీ సహకారం సంఘాలతో సమీక్ష, సమావేశాలు నిర్వహించనున్నారన్నారు. సమావేశాలకు ఆయా శాఖల జిల్లా అఽధికారులు, జెడ్పీ సభ్యులు తప్పకుండా హాజరుకావాలని కోరారు.
హంస వాహనంపై
కామాక్షితాయి విహారం
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాలు భక్తి కోటి మధ్య కోలాహలంగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారు పట్టు వస్త్రాలు, దగదగ మెరిసే సువర్ణాభరణాలతో అలంకరించి, సుగంధ పరిమళాలలు విరజల్లే విశేష పుష్పాలంకరణలో హంస వాహనంపై కొలువుదీరి పురవీధుల్లో విహరించి భక్తులకు కటాక్షించారు. అమ్మవారిని తేజోమయమైన వైభవాన్ని కనులారా దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక పారవశ్యంలో ఆనందో డోలికల్లో తేలియాడారు. వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పాలకమండలి, అసిస్టెంట్ కమిషర్ వెంకట శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాటు చేసింది. సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించారు.


