అధికార దర్పం ప్రదర్శిస్తే ఊరుకోం | - | Sakshi
Sakshi News home page

అధికార దర్పం ప్రదర్శిస్తే ఊరుకోం

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

చర్యకు ప్రతి చర్య తప్పదు

వైఎస్సార్‌సీపీ నాయకులు

పొదలకూరు : అధికారం ఉందని అరాచకాలు సాగించి అక్రమ కేసులు పెట్టిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, చర్యకు ప్రతి చర్య ఉంటుందని వైఎస్సార్‌సీపీ నాయకులు హెచ్చరించారు. పొదలకూరులోని జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ గృహంలో సోమవారం వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ విభాగం కార్యదర్శి ఎస్‌కే అంజాద్‌, బాధిత రైతు గాలం హరికృష్ణ, బిరదవోలు బీసీ సెల్‌ అధ్యక్షుడు రావుల విజయభాస్కర్‌గౌడ్‌ మాట్లాడారు. సోమిరెడ్డి పొదలకూరులో ఎందుకు పనికిరాని నలుగురిని పెట్టుకుని మా నాయకుడు కాకాణిపై విమర్శలు చేయిస్తే ఊరుకునేది లేదన్నారు. అధికారం ఉందని భయపడి కొందరు అధికారులు దిగజారి ఊడిగం చేస్తే భవిష్యత్తులో విచారణను ఎదుర్కోక తప్పదన్నారు. సోమిరెడ్డి మండలానికి ఒక కలెక్షన్‌ ఏజెంట్‌ను ఏర్పాటు చేసుకుని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అక్రమంగా సంపాదిస్తున్నాడని, అందుకు తోడ్పడే అధికారులు సంపాదించినదంతా కక్కాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సర్వేపల్లి చరిత్రలో లేఅవుట్ల యజమానుల వద్ద దండకాలు సాగించిన ఎమ్మెల్యేలు లేరని, సోమిరెడ్డి ఒక్కడికే ఆ ఘనత దక్కిందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే లేఅవుట్లపై నానాయాగి చేసి పోలీసు కేసులు పెట్టించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ కేసులు ఏమయ్యాయో తెలియదన్నారు. సత్యనారాయణ లేఅవుట్లో స్థలాన్ని డ్రామాలు ఆడి కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎంత మందికి రిజిస్ట్రేషన్లు చేసినా మా పార్టీ అధికారంలోకి రాగానే గోవర్ధన్‌రెడ్డి ద్వారా ప్రజలకు అప్పగించడం జరుగుతుందన్నారు. మస్తాన్‌బాబు గొంతు చించుకుంటే అబద్ధాలు నిజాలైపోవని, ఎవరు తాగుబోతులో చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. హరికృష్ణ వద్ద విద్యుత్‌ ఏఈ లంచం తీసుకోలేదని ప్రమాణం చేయగలడా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి జరిగిన ఘటనపై విచారణ చేయించాల్సింది పోయి, టీడీపీ నాయకులతో విలేకరుల సమావేశం పెట్టించడం అవినీతి పరులను వెనుకేసుకు రావడమేనన్నారు. అకారణంగా రైతును కొట్టించడమే కాక తాగుబోతులని చిత్రీకరించేందుకు మస్తాన్‌బాబు ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నామన్నారు. బిరదవోలు పంచాయతీలో కమీషన్ల కోసం కక్కుర్తి పడే భాస్కర్‌ వంటి వ్యక్తుల మాటలకు విలువ ఉండదన్నారు. ఉపాధి పనుల్లో దొంగ సంతకాలు పెట్టించుకుని డబ్బులు సంపాదించే భాస్కర్‌కు నీతి, నిజాయతీలు లేవన్నారు. బిరదవోలు పంచాయతీ బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం విషయంలో కూడా టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, మాజీ సొసైటీ చైర్మన్‌ గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, నాయకులు సీహెచ్‌ రమేష్‌, దస్తిగిరి, కేతు రామిరెడ్డి, జీ శ్రీనివాసులు, వాకాటి శివప్రసాద్‌రెడ్డి, డీ విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement