ముత్యాలమ్మ హుండీ రాబడి రూ.27.90 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ముత్యాలమ్మ హుండీ రాబడి రూ.27.90 లక్షలు

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

చిల్లకూరు: మండలంలోని తూర్పుకనుపూరులోని ముత్యాలమ్మ ఆలయంలో హుండీ కానుకల లెక్కింపును సోమవారం చేపట్టారు. మార్చిలో ముత్యాలమ్మ జాతర జరిగింది. ఆ తరువాత నుంచి 58రోజుల పాటు భక్తులు ముత్యాలమ్మ, పోలేరమ్మ ఆలయాల్లోని హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.27,90,038 రాబడి వచ్చిందని ఆలయ ఈఓ నవీన్‌కుమార్‌ తెలిపారు. ముత్యాలమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.24,86,668, పోలేరమ్మ ఆలయ హుండీల ద్వారా రూ.3,03,370 ఆదాయం వచ్చిందని వివరించారు. దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎం సుధీర్‌, ఆలయ చైర్మన్‌ చిల్లకూరు దశరథరామిరెడ్డి, ఆలయ, విశ్రాంత బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

14న జాబ్‌మేళా

నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎంప్లాయీమెంట్‌ ఆఫీస్‌, సీడాప్‌ సంయుక్తంగా ఈ నెల 14న నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్‌ఖయ్యూం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23 ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నారని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ చదివిన నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని తెలిపారు. నిరుద్యోగ యువత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 87126 55686, 87901 17279 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

సింహ వాహనంపై కామాక్షితాయి

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగు తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామాక్షితాయి అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కామాక్షితాయి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. ఆలయ చైర్మన్‌ అశోక్‌రెడ్డి, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ వెంకట శ్రీనివాసులురెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

శ్రీవారి దర్శనానికి

8 గంటలు

తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,942 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,238 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.

టీకాలు క్రమం

తప్పకుండా అందించాలి

దుత్తలూరు: చిన్నారులకు టీకాలను క్రమం తప్పకుండా అందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారిణి ఉమామహేశ్వరి సూచించారు. దుత్తలూరు పీహెచ్‌సీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. పీహెచ్‌సీ పరిసరాలు, టీకాలు భద్రపరిచే గది, ఫార్మశీ గదిని పరిశీలించారు. వ్యాక్సినేషన్‌పై వైద్యారోగ్య సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం పీహెచ్‌సీ వైద్యాధికారి ఆయూబ్‌ అప్సర్‌ను అడిగి వైద్యసౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement