గ్రావెల్‌ గద్దలు | - | Sakshi
Sakshi News home page

గ్రావెల్‌ గద్దలు

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

ప్రభుత్వ భూముల్లో పెద్దఎత్తున

అక్రమ తవ్వకాలు

సాగరమాల రోడ్డుకు తరలింపు

రూ.కోట్లు కొల్లగొడుతున్న

కూటమి నాయకులు

కోట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. మండలంలోని ప్రభుత్వ భూముల నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారు. రేయింబవళ్లు భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి పెద్ద ఎత్తున సాగరమాల రోడ్డు పనులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాగరమాల రోడ్డు పనులకు గ్రావెల్‌ పెద్ద ఎత్తున అవసరం ఉంది. మండలంలోని విద్యానగర్‌ నుంచి కేశవరం వరకు నాణ్యమైన గ్రావెల్‌ భూములు ఉన్నాయి. ఈ అవకాశాన్ని తమ్ముళ్లు వరంలా మార్చుకున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తమ్ముళ్ల గ్రావెల్‌ దందాకు ఆయా ప్రాంతాల్లో తవ్వేసిన గ్రావెల్‌ గుంతలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

రూ. కోట్లలో దోపిడీ

సాగరమాల ప్రాజెక్ట్‌ కింద చిల్లకూరు మండలం తూర్పుకనుపూరు నుంచి నాయుడుపేట వరకు 38 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీని కోసం వేల టన్ను ల గ్రావెల్‌ అవసరం ఉంది. దీన్ని తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకొనేందుకు అవకాశంగా మార్చుకున్నారు. గ్రావెల్‌ ఉన్న ప్రభుత్వ భూములు, కుంటలను కారు చౌకగా రైతుల వద్ద తీసుకుని దర్జాగా గ్రావెల్‌ను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. వీటిలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్‌మెంట్‌, డీకేటీ భూములు కూడా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి రైతుకు ఎకరాకు రూ.5లక్షల నుంచి రూ.7లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఎకరా భూములో రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల వరకు విలువైన గ్రావెల్‌ను తరలిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి 50 అడుగుల వరకు ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఊనుగుంటపాళెం, చిట్టేడు, గూడలి, కేసవరం పంచాయతీల పరిధిలో 100 ఎకరాలకుపైగా భూముల్లో కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్‌ను ఇప్పటి వరకు తరలించారు. ఇలా రూ.కోట్లలో గ్రావెల్‌ దందా కొనసాగించనట్లు తెలుస్తోంది. సాగరమాల ముసుగులో బయట ప్రాంతాలకు సైతం గ్రావెల్‌ను తరలిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సాగరమాల రహదారి పేరుతో టీడీపీ నేతలు సాగిస్తున్న గ్రావెల్‌దందాపై విచారణ జరపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement