● 9,200 ఎకరాల ఆయకట్టు
● విడుదల కాని సాగు నీరు
● అదను దాటిపోతోందని రైతుల గగ్గోలు
కొడవలూరు: జిల్లాలో రెండో పంట సాగుకు సోమశిల నుంచి ఈ నెల 4న సాగునీటిని విడుదల చేశారు. శనివారం కనిగిరి రిజర్వాయర్ నుంచి కూడా అన్ని కాలువలకు నీటిని వదిలారు. అయితే మలిదేవి కాలువ ఆయకట్టు రైతులు ఏం పాపం చేశారో గానీ సోమవారం కూడా సాగునీరు విడుదల చేయలేదు. మలిదేవి కాలువ కింద నార్తురాజుపాళెం, కోవూరు, రామన్నపాళెం, మానేగుంటపాడు, ఆలూరుపాడు, మోడేగుంట గ్రామాల్లో 9,200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువ డ్రెయిన్ గాను, సాగునీటి కాలువ గాను ఉపకరిస్తుంది. అందువల్ల దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కనిగిరి రిజర్వాయర్ నుంచి అన్ని సాగు నీటి కాలువలతో పాటు దీనికి నీరు విడుదల చేస్తుంటారు. రెండ్రోజుల క్రితమే తూర్పు కాలువ కింద ఉన్న అన్ని కాలువలకు సాగునీరు విడుదల చేశారు. కానీ మలిదేవి కాలువకు మాత్రం సోమవారం సాయంత్రం వరకు విడుదల చేయలేదు. మరోపక్క నార్లు పోసుకునేందుకు అదను దాటుతుండడంతో ఆయకట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. సంబంఽధిత ఇరిగేషన్ ఏఈ శ్రీనివాసులును ఫోన్‌లో సంప్రదించినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆయకట్టు రైతులు వాపోయారు. ఎప్పటికి విడుదల చేస్తారో కూడా స్పష్టత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ‘సాక్షి’ ఏఈ శ్రీనివాసులును వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా లిఫ్ట్ చేయలేదు. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి మలిదేవికి నీటి విడుదలపై స్పష్టత ఇవ్వడం ద్వారా రైతుల్లో ఆందోళనకు తెర దించాల్సిన అవసరం ఉంది.


