● అడ్డుకున్న గ్రామస్తులు
పొదలకూరు : మండలంలోని డేగపూడి గ్రామ చెరువులోని మట్టిని అక్రమంగా ఇటుకబట్టీలకు ఆదివారం రాత్రి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పటికే పదుల సంఖ్యలో ట్రక్కుల మట్టిని ఇటుకబట్టీ వద్దకు తోలారు. గ్రామంలో ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయట ప్రాంతం నుంచి ఇటుక రాయిని కాల్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి అధికార పార్టీ నాయకుల అండదండలతో చెరువులో జేసీబీని ఏర్పాటు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామరైతులు ట్రాక్టర్లను నిలువరించారు. ఎవరి అనుమతితో చెరువులోని మట్టిని ఇటుక బట్టీలను తరలిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో మట్టి తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ వెంటనే గ్రామస్తులు ఇరిగేషన్ ఏఈ అనిల్‌కుమార్‌కు సమాచారం అందించారు. సోమవారం ఏఈ చెరువు వద్దకు వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా చెరువు నుంచి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మట్టి అక్రమ తరలింపుపై గ్రామస్తులు సమాచారం అందజేసిన వెంటనే నిలిపివేయించామన్నారు. ఇకపై అనుమతులు లేకుండా ఎవరైనా మట్టిని తరలిస్తే పోలీసు కేసులు పెట్టాలని సాగునీటి సంఘం అధ్యక్షుడికి సూచించారు.


