సేవకు ప్రతిరూపం | - | Sakshi
Sakshi News home page

సేవకు ప్రతిరూపం

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

నెల్లూరు(అర్బన్‌): చిరునవ్వుతో పలుకరిస్తూ.. రోగుల మంచి, చెడుల్ని తెలుసుకుంటూ స్వాంతన చేకూర్చే వారే నర్సులు. నర్సింగ్‌ వృత్తి ఎంతో పవిత్రమైంది. సేవకు ప్రతి రూపం. రోగి శరీరం నుంచి చీము, రక్తం కారుతున్నా.. దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా వైద్యం చేస్తారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలు పణంగా పెట్టి రోగులకు సేవలందించారు. జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మేనెల 12వ తేదీన అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. మంగళవారం జిల్లాలో నర్సులు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఎంతమందంటే..

జిల్లాలో 52 పీహెచ్‌సీలు, 10 సీహెచ్‌సీలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రి, 490 విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌లు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రైవేట్‌ రంగంలో సుమారు 500 హాస్పిటళ్లున్నాయి. వీటిలో సుమారు 5 వేల మందికి పైగా నర్సులు సేవలందిస్తున్నారు. గ్రామాల్లో సుమారు 1,500 మంది ఏఎన్‌ఎంలు విధుల్లో ఉన్నారు.

ఆప్యాయంగా మాట్లాడుతూ..

ఆస్పత్రిలో పలువురు రోగులకు చీము, నెత్తురు కారుతుంటుంది. అయితే నర్సులు నవ్వుతూ రోగిని ఆప్యాయంగా పలకరిస్తూ గాయాలను శుభ్రపరిచి కట్లు కడుతారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి సైతం ఇలాగే చికిత్స అందిస్తారు. జీవితంపై విరక్తితో మందు తాగిన, ఆపరేషన్‌ చేయించుకున్న వారికి, విషజ్వరాలతో మంచం పట్టిన వారికి సేవలందించేది నర్సులే. ఐసీయూలో వెంటిలేటర్‌ మీదున్న రోగులకు, డాక్టర్ల సూచనల ప్రకారం దగ్గరుండి సేవలు చేస్తారు. రాత్రి, పగలు తేడాల్లేకుండా వారు చేసే సపర్యల వల్లనే రోగులు కోలుకుంటారు. నెల్లూరు నగరంలోని సర్వజన ఆస్పత్రిలో ఓపీ పేషెంట్లు రోజుకు సుమారు 1,500 మంది వస్తారు. ఇన్‌ పేషెంట్లుగా 500 మంది ఉంటారు. వీరిలో పురిటి బిడ్డలు, గర్భిణులు, బాలింతలున్నారు. వీరందరికి సేవలందించడమే కాకుండా నెలలు నిండకుండా పుట్టిన పసికందులు ఐసీయూలో ఉంటారు. వారిని బాక్సుల్లో ఉంచి కంటికి రెప్పలా కాపాడేది నర్సులే. అందుకే నర్సింగ్‌ వృత్తి అంటే పవిత్రమైందని పేర్కొంటున్నారు.

రోగికి సైలెన్‌ పెడుతున్న నర్సు

రోగులకు అండగా నర్సులు

జిల్లాలో 5 వేల మందికి పైగా..

కరోనా సమయంలో

ప్రాణాలు పణంగా పెట్టి సేవలు

నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

Advertisement
 
Advertisement
Advertisement