● మరణంలోనూ వీడని బంధం
● ఉన్నత విద్యనభ్యసించిన స్నేహితులు
● సినీ రంగంలో రాణించాలని సంకల్పం
● చిన్నచూపు చూసిన విధి
నెల్లూరు(బృందావనం): ఆ ఇద్దరిది ఒకే ఊరు.. ఒకరు చైన్నెలో, మరొకరు వేలూరులో ఇంజినీరింగ్ విద్యనభ్యసించారు. సాఫ్ట్‌వేర్ రంగంలో అడుగిడారు. కొంతకాలం ఉద్యోగులుగా ప్రతిభ చాటారు. ఒకరు డ్యాన్స్, నటనలో, మరొకరు ఫొటోగ్రఫీ, దర్శకత్వంపై ఆసక్తి పెంచుకున్నారు. అందులో రాణించారు. సినీ రంగంలో రాణించాలన్న సంకల్పం వారిని స్నేహితులుగా మార్చింది. కానీ విధి ఆడిన వింత నాటకంతో విగతజీవులుగా మారారు. నెల్లూరు వేదాయపాళేనికి చెందిన కత్తి భరత్‌కాంత్ (31), గూడ సాయి త్రిలోక్ (31) హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. భరత్‌కాంత్ తల్లిదండ్రులు కత్తి మోహన్‌రావు, విజయలక్ష్మి, సాయిత్రిలోక్ తల్లిదండ్రులు గూడ మాల్యాద్రి, విజయలక్ష్మి వేదన చూసిన బంధుమిత్రుల కళ్లు చెమ్మగిల్లి గుండెలను బరువెక్కించాయి.
ఇదీ నేపథ్యం
మోహన్‌రావు వేదాయపాళెంలోని శ్రీస్వామి అయ్యప్ప దేవస్థానం పాలకమండలి కార్యదర్శిగా ఉన్నారు. తూపిలిపాళెంలో శ్రీహరిహర హేచరీస్ నిర్వహిస్తున్నారు. సాహితి ప్యారడైజ్‌లో నివాసముంటున్నారు. ఆయనకు ఇద్దరుపిల్లలు ఒక కుమార్తె, కుమారుడు భరత్‌కాంత్. కుమార్తె అమెరికాలో ఉద్యోగిగా ఉన్నారు. మాల్యాద్రి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఉద్యోగి. కరెంటాఫీస్ సెంటర్‌లోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం వెనుకవైపున ఐకానిక్ హోమ్స్ మాగ్నోలియాలో నివాసముంటున్నారు.


