● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
● వినతులు స్వీకరించిన
కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతులు చూసి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, డిప్యూటీ కలెక్టర్లు వంశీకృష్ణ, కేశవర్ధన్‌రెడ్డి, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డుల డీడీ నాగశేఖర్ అర్జీలను స్వీకరించారు.
● భూగర్భ జలాలను పెంపొందించాలని ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్‌రెడ్డి కోరారు. జేసీకి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కొద్దిరోజులుగా ఇంకుడుగుంతలపై అశ్రద్ధ వహించిందన్నారు. నీటి వనరులను పెంపొందించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలన్నారు. నేతలు మాల్యాద్రి, మిడతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
● జేసీసీ డైరెక్టర్లను ఏర్పాటు చేయాలని యానాది సంఘాల మహాకూటమి నాయకులు కోరారు. రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ బత్తిన లక్ష్మీశేఖర్ మాట్లాడుతూ జూన్ 12న జరగాల్సిన సమావేశాన్ని నిలిపివేశారన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఫలరసం సేకరణ కేంద్రాల్లో 274 మంది యానాదులకు సభ్యత్వం ఉందన్నారు. సేకరించిన ఫలసారాన్ని జేసీసీకి విక్రయిస్తామన్నారు. కొత్త ఓటర్లకు డైరెక్టర్లకు అవకాశం కల్పించాలని, ఏళ్లు గడుస్తున్నా పాతవారినే కొనసాగించడం బాధాకరమన్నారు.
● విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోరారు. ఆర్‌టీఈ అమలుకు పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరం తనిఖీలు చేపట్టాలన్నారు. ఫిర్యాదులు చేయడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
● చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో సర్వే నంబర్ 872/4బీ, సర్వే నంబర్ 872/5లో ఉన్న రెండెకరాల భూమిని కలెక్టరేట్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఆక్రమించారని సీపీఐ ఆధ్వర్యంలో స్థానికులు నినాదాలు చేశారు. విచారణ జరిపి ఆక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుని హక్కుదారుడికి భూమిని అప్పగించాలని కోరారు.


