శేఖరన్నా.. నోరు అదుపులో పెట్టుకో | - | Sakshi
Sakshi News home page

శేఖరన్నా.. నోరు అదుపులో పెట్టుకో

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

లేకుంటే గుణపాఠం తప్పదు

ఉదయగిరి రూరల్‌: శేఖరన్నా.. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిపై వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేజర్ల సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ఉదయగిరిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరులో మాట్లాడిన తీరుపై నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెండు సార్లు, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రెండుసార్లు టికెట్‌ పొంది నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నీవు వారిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌, అభ్యర్థుల వద్ద, అంగన్‌వాడీ పోస్టు కోసం, విద్యుత్‌ శాఖలో షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టుల కోసం నగదు వసూలు చేసిన చరిత్ర నీదన్నారు. ప్రస్తుతం మీ పరిస్థితి కూరలో కరివేపాకులా తయారైందన్నారు. అవుట్‌ డేటెడ్‌ పొలిటీషియన్‌ అయిన నిన్ను టీడీపీలో ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఉనికి చాటుకునేందుకు నానా పాట్లు పడుతున్నావన్నారు. ఎంతో గౌరవప్రదమైన మేకపాటి కుటుంబంలో పుట్టి ఇలాంటి దిగజారుడు మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. నీకు దమ్ముంటే టీడీపీ టికెట్‌ తెచ్చుకొని ఉదయగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే తాను రాష్ట్రం వదిలి వెళ్లిపోతానని సవాల్‌ విసిరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బి.శ్రీనివాసులు యాదవ్‌, సయ్యద్‌ గౌస్‌మొహిద్దీన్‌, సోమిరెడ్డి, ఎంఏ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement