● రొయ్యల గుంతలు
టీడీపీ నేతలవిగా ప్రచారం
వాకాడు: మండలంలోని పామంజి, జమీన్ కొత్తపాళెం గ్రామాల్లో ఆక్వా విద్యుత్ సర్వీసులపై సోమవారం తిరుపతి జిల్లా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 7 అక్రమ విద్యుత్ సర్వీసులను గుర్తించారు. అయితే పట్టుబడిన వారు అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో 100, 101, 75, 154, 66, 79, 74 నంబర్లు గల ఆక్వా విద్యుత్ సర్వీసులను తొలగించి సీజ్ చేసినట్లు సమాచారం. దాడుల్లో విజిలెన్స్ అధికారులు పూర్ణచంద్రకుమార్, రంగయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కత్తితో హల్‌చల్.. యువకుడికి రిమాండ్
ముత్తుకూరు(పొదలకూరు): పిడతాపోలూరు సెంటర్ వద్ద కత్తి పట్టుకుని హల్‌చల్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈనెల 9వ తేదీన రాత్రి పిడతాపోలూరు సెంటర్‌లో వీరంగం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు రూరల్ మండలం చింతలరెడ్డిపాళెం యలమదిన్నె ప్రాంతానికి చెందిన డేనియల్ రాజుగా యువకుడిని గుర్తించారు. అతడిని వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు సోమవారం పోలీసులు వెల్లడించారు.


