ఇందుకూరుపేట: అటవీ ప్రాంతం నుంచి రెండు జింకలు మండలంలోని నిడిముసలి గ్రామంలోకి సోమవారం తెల్లవారుజామున వచ్చాయి. అవి వీధుల్లో తిరుగుతుండగా స్థానికులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు యువకులు ఉత్సాహంతో పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ఒకటి తప్పించుకుని వేగంగా వెళ్లిపోయింది. మరో జింకను పట్టుకోగా.. కాసేపటికి అది సమీప వ్యవసాయ పొలాల్లోకి పరుగులు తీసింది. గ్రామస్తులు పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కోడూరు సెక్షన్‌కు చెందిన అటవీ శాఖ అధికారి అల్తాఫ్ నిడిముసలి గ్రామానికి చేరుకుని జింకలు వచ్చిన మార్గం, పరిసర పరిస్థితులపై వివరాలు సేకరించారు. గతంలో కూడా జింకలు, అడవి పందులు గ్రామాల్లో కనిపించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అటవీ జంతువులను వెంబడించకూడదని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు కోరారు.


