పచ్చని పల్లెలు.. కాలుష్య కాసారాలు | - | Sakshi
Sakshi News home page

పచ్చని పల్లెలు.. కాలుష్య కాసారాలు

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

ముత్తుకూరు (పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని పల్లె ప్రాంతాలు ప్రశాంత వాతావరణానికి ప్రతీకలుగా నిలవాల్సిన వేళ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కాలుష్య కోరల్లో చిక్కుకొని విలవిలల్లాడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాభివృద్ధి కోసం మంజూరు చేసే నిధులను సక్రమంగా వినియోగిస్తూ పల్లె ప్రగతికి బాటలు వేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ మండలంలో పరిస్థితి భిన్నంగా మారింది. పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతూ, కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, పెట్రోలియం సంస్థలు, సిమెంట్‌ కర్మాగారాలు, పామాయిల్‌ ఫ్యాక్టరీలు వంటి పరిశ్రమలు ఏర్పడ్డాయి. అయితే ఈ అభివృద్ధి గ్రామస్తుల జీవన విధానాన్ని దెబ్బతీస్తున్నట్టు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాగు క్షీణత.. ఉపాధి కోల్పోయిన కూలీలు

ప్రాజెక్టుల నిర్మాణానికి ముందు పచ్చని వాతావరణంలో ఉన్న కృష్ణపట్నం, ముత్తుకూరు, పంటపాళెం, నేలటూరు, పైనాపురం గ్రామాలు నేడు పూర్తిగా మారిపోయాయి. వేల ఎకరాల భూములు పరిశ్రమల కోసం రైతులు త్యాగాలు చేసినప్పటికీ అప్పట్లో ఇచ్చిన నష్టపరిహారం తక్కువగా ఉంది. ప్రస్తుతం ఆ భూముల విలువలు రూ.కోట్లు పలుకుతున్నాయి. ఈ గ్రామాల ప్రజలు ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. పరిశ్రమల ప్రభావంతో వ్యవసాయం క్షీణ దశకు చేరుకుంది. ఫలితంగా వ్యవసాయ కూలీలకు పనులు లేకుండాపోయాయంటున్నారు.

ప్రభుత్వం చొరవ చూపాలి

పారిశ్రామిక అభివృద్ధి ఆహ్వానించదగ్గ విషయమైనా పర్యావరణ సమతుల్యతను పాటించాల్సిన బాధ్యత పరిశ్రమలపై ఉంది. ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం పరిశ్రమలు కాలుష్యాన్ని నియంత్రించాలి. ఇందుకోసం పొల్యూషన్‌ బోర్డు సమర్థవంతంగా పనిచేసి కాలుష్య కోరల నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆయా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టి, గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు నిర్వహించి కృష్ణపట్నం, ముత్తుకూరు, నేలటూరు, పంటపాళెం, పైనాపురం గ్రామాలను కాపాడాలని వేడుకుంటున్నారు.

గ్రామాల మీదుగా బొగ్గును తరలిస్తున్న లారీలు

కృష్ణపట్నం గ్రామ వ్యూ

బొగ్గు, పరిశ్రమల దుమ్ముతో

గాలి, నీరు కలుషితం

ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు

పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

పేరుకేమో పారిశ్రామికవాడ.. ప్రజలకేమో రోగాలు అన్న చందంగా మారింది ముత్తుకూరు మండల పరిస్థితి. ఒకప్పుడు ఇక్కడి గ్రామాల్లో పచ్చని పైర్లు, స్వచ్ఛమైన సాగునీరు, పక్షుల కిలకిల రావాలతో పరవశించే వాతావరణం ఉండేది. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కాలుష్యం కోరలు చాచుతూ గ్రామస్తులు జబ్బుల బారిన పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement