పొదలకూరు: పొదలకూరు పరిసర ప్రాంతాల్లో వేసిన లేఅవుట్లలో ప్రజాప్రయోజనాల కోసం పంచాయతీలకు కేటాయించిన స్థలాలకు కొందరు ఎసరు పెడుతున్నారు. అక్రమ లేఅవుట్లు వేసిన వారు ఇటీవల ఆ స్థలాలను సైతం అమ్మకాలకు పెట్టారు. రూ.కోట్ల విలువైన స్థలాలను ఆయా పంచాయతీలు స్వాధీనం చేసుకోలేకపోతున్నాయి. లేఅవుట్లు అప్రూవల్ కాకపోవడంతో చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుంటున్నట్టు విమర్శలున్నాయి. అంతే కాకుండా అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మించుకోవాలని పంచాయతీ అప్రూవల్‌కు వెళ్తే చేదు అనుభవం ఎదురవుతోంది. వ్యక్తిగతంగానైనా ప్లాట్‌ను పంచాయతీ ఆమోదం తీసుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు.
పట్టించుకోకపోవడంతో..
పొదలకూరు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో 57 లేఅవుట్లున్నాయి. అవి నుడా పరిధిలోకి రాకముందు అంటే పదేళ్ల క్రితం పంచాయతీలకు అక్షరాల రూ.8.64 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అయితే సంబంధిత శాఖ అధికారులు నాడు పట్టించుకోలేదు. పట్టణ పరిసర ప్రాంతాల్లో 2006 నుంచి 2010 వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు వచ్చి రూ.కోట్లు వెచ్చించి పొలాలు కొనుగోలు చేసి లేఅవుట్లు వేశారు. ప్రస్తుతం పొదలకూరు పంచాయతీలో 10 లేఅవుట్లకు ఆమోదం లేకపోవడంతో వాటిలో పంచాయతీకి కేటాయించిన స్థలాలను సైతం అమ్ముకున్నట్టు తెలుస్తోంది.
ఇష్టారాజ్యంగా..
అప్రూవల్ లేని లేఅవుట్లలో ఇష్టానుసారం అమ్మకాలు సాగించారు. తర్వాత నుడా పరిధిలోకి పొదలకూరు రావడంతో ఆ నిబంధనల ప్రకారం లేఅవుట్లను నిర్మించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆమోదం పొందని వాటిల్లో కొందరు అమ్మకాలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం లేఅవుట్ వేసేవారు 10 శాతం స్థలాన్ని బడి, గుడి, ఇతర ప్రజాప్రయోజనాల కోసం పంచాయతీ లేదా నుడాకు అప్పగించాలి. ఆ మేరకు రిజిస్ట్రేషన్ చేయించాలి. గతంలో వేసిన అక్రమ లేఅవుట్లలో కొందరు పంచాయతీలకు 10 శాతం స్థలాన్ని వదిలారు. కొంతకాలం వేచి ఉండి గుట్టుచప్పుడు కాకుండా వాటిని కూడా అమ్ముకున్నారు.
వివాదాలు
ఇటీవల సత్యనారాయణ లేఅవుట్లో ఉన్న ప్రజాప్రయోజన స్థలంపై పెద్ద ఎత్తున వివాదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ స్థలంపై పంచాయతీ, ప్రైవేట్ వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే గతనెలలో స్థలాన్ని ప్లాట్లుగా మార్పుచేసి రిజిస్ట్రేషన్ చేయడంతో పంచాయతీ సెక్రటరీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై కేసు నమోదు చేశారు. ఇలాంటి వివాదాలున్న స్థలాలు ఇంకా పంచాయతీలో ఉన్నాయి. అధికారులు చొరవ తీసుకుని ప్రజాప్రయోజన స్థలాలను కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం లేఅవుట్లలో అటువంటి స్థలాలు రూ.కోట్లు విలువైనవిగా స్థానికులు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా వివాదాస్పదంగా మారిన సత్యనారాయణ లేఅవుట్‌లోని ప్రజాప్రయోజన స్థలాన్ని ఇటీవల ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ దీపిక పరిశీలించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకున్నారు.
అప్రూవల్ కాని లేఅవుట్లలో
భూముల అమ్మకాలు
పదేళ్ల క్రితమే రూ.8.64 కోట్ల శఠగోపం
పరిసర ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు
కొత్తవాటికి మాత్రం నుడా అనుమతులు
నిద్రావస్థలో అధికార యంత్రాగం
పొదలకూరులో ఇదీ పరిస్థితి
చర్యలు తీసుకుంటాం
పొదలకూరు పంచాయతీలో పాత లేఅవుట్లు 10 వరకు ఉన్నాయి. వాటిలో పంచాయతీలకు కేటాయించిన స్థలాలపై చర్యలు తీసుకుంటాం. నుడా పరిధిలో కొత్త లేఅవుట్లు నాలుగు ఉన్నాయి. అవకతవకలకు పాల్పడినట్టు మా దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తున్నాం.
– యశ్వంత్‌సింగ్,
పంచాయతీ సెక్రటరీ, పొదలకూరు


