మండే ఎండలు.. చెంతనే ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

మండే ఎండలు.. చెంతనే ప్రమాదాలు

May 11 2026 9:31 AM | Updated on May 11 2026 9:31 AM

నెల్లూరు(క్రైమ్‌): భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సూర్యుడి ధాటికి ప్రజలు అల్లాడుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రత్తలతో అగ్నిప్రమాదాలు పొంచి ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోతే ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపకశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.

నివాసాల్లో..

గ్యాస్‌ స్టౌను నేలమట్టానికి వీలైనంత ఎత్తులో ఉంచుకోవాలి. అగ్గిపుల్ల లేదా లైటర్‌ను వెలగించిన తర్వాత మాత్రమే గ్యాస్‌ బర్నల్‌ నాబ్‌ను తిప్పాలి. వంట పూర్తయ్యాక సిలిండర్‌ వాల్వ్‌ను, బర్నల్‌ వాల్‌ను ఆపివేయాలి. గ్యాస్‌ లీకై తే వెంటనే రెగ్యులేటర్‌లు ఆపివేయాలి. ఎలక్ట్రికల్‌ స్విచ్‌లు ఆన్‌ చేయరాదు. దేవుని దీపాలు, అగర్‌బత్తీలు ఆర్పివేయాలి. గాలి, వెలుతురు కోసం అన్ని కిటికీలు, తలుపులను తెరవాలి.

గ్రామీణ ప్రాంతాల్లో..

గ్రామాల్లో గుడిసెల మధ్య కనీస దూరం ఉండాలి. బహిరంగ మంటలను అనుమతించరాదు. దీని వల్ల నిప్పురవ్వలు ఎగిరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యుత్‌ తీగలకు దగ్గరలో గడ్డివాములు ఏర్పాటు చేయరాదు.

విద్యుత్‌ పరికరాలతో జాగ్రత్త

నాణ్యత కలిగిన విద్యుత్‌ వైర్లు, పరికరాలు మాత్రమే ఇళ్లు, దుకాణాల్లో వాడాలి. పాతవి, కాలం చెల్లిన వైర్లను ఎప్పటికప్పుడు మార్చుకుని ఫ్యూజులు, కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవాలి. ఒక సాకెట్‌కు ఒక్క విద్యుత్‌ పరికరం మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి. లాప్‌ట్యాప్‌, సెల్‌ఫోను చార్జింగ్‌లను బెడ్‌ దగ్గర పెట్టుకోరాదు. ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేసే ఆధునిక ఆపరేటింగ్‌ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి.

వాహన ప్రయాణంలో..

కారులో లేదా ఇతర వాహనాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో వాహనంపై అధిక ఉష్ణోగ్రత్తల ప్రభావం చూపే అవకాశం ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకును పూర్తిగా నింపడం ప్రమాదకరం. అధిక వేడి ప్రభావంతో ట్యాంకులో గ్యాస్‌ వ్యాకోచం చెంది ట్యాంక్‌ పేలిపోయే అవకాశం ఉంది. టైర్లలో గాలి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం మంచిది. గంటల తరబడి ప్రయాణించినప్పుడు ఇంజిన్‌ వేడెక్కడం, వాహనంలోని వైరింగ్‌ కాలిపోవడం వల్ల అకస్మాత్తుగా మంటలు వ్యాపిస్తాయి. బ్యాటరీ, ఫ్యూజ్‌, విద్యుత్‌ వైర్లు నాణ్యమైనవి వాడాలి. వాహనంలో వైరింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి.

మంటలు చుట్టుముడితే..

దుస్తులకు నిప్పంటుకుంటే పరిగెత్తకూడదు. నేలపై దొర్లడం లేదా దుప్పటి చుట్టుకోవడం మంచిది. కాలిన శరీరభాగంపై చల్లని నీరు పోయాలి. విద్యుదాఘాతం వల్ల జరిగే ప్రమాదాల్లో మంటలు ఆర్పేందుకు నీటిని ఉపయోగించరాదు. పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లతో నేలపై పాకుతూ బయటపడాలి. ముక్కు, నోటికి అడ్డంగా తడిగుడ్డ ఉంచాలి. లిఫ్ట్‌, ఎక్స్‌లేటర్స్‌ను ఉపయోగించకపోవడం ఉత్తమం. అత్యవసర వేళల్లో డయల్‌ 101 నంబర్‌కు ఫోన్‌ చేసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.

కేంద్రం కార్యాలయ నంబర్‌ అధికారి నంబర్‌

నెల్లూరు 0861–2331051 99637 34284

కావలి 08626–243101 99637 34286

వింజమూరు 08629–249101 99637 35446

ఉదయగిరి 08620–229251 99637 35314

మర్రిపాడు 08620–210111 99637 44817

ఆత్మకూరు 08627–221222 99637 34394

పొదలకూరు 08621–225202 99637 34828

రాపూరు 08621–226145 99637 35094

గూడూరు 08624–251899 99637 34305

అప్రమత్తంగా ఉండాలంటున్న అగ్నిమాపక అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement