వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయంలో ఎన్‌సీసీ క్యాడెట్లకు రెండో రోజు శిక్షణ ఆదివారం కొనసాగింది. ఇందులో భాగంగా రెండో రోజు ఫైరింగ్, డ్రిల్‌లో శిక్షణ ఇచ్చినట్లు క్యాంపు కమాండెంట్ కల్నల్ డి.కరంచంద్ తెలిపారు. పది రోజుల పాటు శిక్షణ కొనసాగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ క్యాంపు కమాండెంట్ కల్నల్ సూరజ్, ఆర్మీ స్టాఫ్ జాస్పల్ సింగ్, రమేష్ పాండే, వెంకటరమణ, ఎన్‌సీసీ ఆధికారులు ప్రసాద్, మస్తాన్‌వలీ, పెంచలపులయ్య, దీప్తి, జయరాం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
ఆత్మకూరు: ద్విచక్ర వాహనం అదుపుతప్పి బ్రిడ్జ్ పిల్లర్‌ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందిన ఘటన మున్సిపల్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఎస్సై జిలానీ వివరాల మేరకు.. పొదలకూరుకు చెందిన గురునాథం శీనయ్య (36) తన ద్విచక్ర వాహనంపై రెండు రోజుల క్రితం ఆత్మకూరుకు వచ్చాడు. బంధువుల ఇంటిలో ఉండి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని బొగ్గేరు బ్రిడ్జిపై అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై శీనయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పెద్ద పడుగుపాడులో కార్డెన్ సెర్చ్
● 29 బైక్‌లు, 2 ఆటోల సీజ్
కోవూరు: మండలంలోని పెద్ద పడుగుపాడు పంచాయతీ ఎన్టీఆర్ మిక్స్‌డ్ కాలనీలో పోలీసులు ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాల్లేని 29 బైక్‌లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కాలనీలో అనుమానిత వ్యక్తుల సంచారం ఉందా అని ఆరాతీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కోవూరు ఇందుకూరుపేట ఎస్సైలు ముత్యాలరావు, నవీన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


