నెల్లూరు (వీఆర్సీ సెంటర్): జిల్లాలో ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగులు, అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రతి పనికీ ఒక్కో రేటు నిర్ణయిస్తూ లంచాలు డిమాండ్ చేస్తూ ప్రజలు, రైతుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారు. ఇటీవల జిల్లాలోని మనుబోలు మండలం కట్టువపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న లైన్‌మెన్ రమేష్ వ్యవసాయ విద్యుత్ సర్వీసు పేరు మార్చేందుకు ఓ రైతు వద్ద నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మరిచిపోక ముందే శుక్రవారం పొదలకూరు మండలం నావూరుపల్లి గ్రామానికి చెందిన రైతుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు స్థానిక విద్యుత్‌శాఖ ఇన్‌చార్జి అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) శ్రీనివాసరావు రూ.40 వేలు లంచం తీసుకుని కూడా విద్యుత్ సర్వీసు ఇవ్వకపోవడం, నిలదీసిన రైతును పోలీస్‌స్టేషన్‌లో కొట్టించడం జిల్లాలో సంచలనంగా మారింది.
లంచం తీసుకుని కూడా..
టీడీపీ నేతలు చెప్పారని..
పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన పెంచలమ్మ, మహేష్ అనే రైతులు నాలుగున్నర ఎకరాల్లో నిమ్మ పంట సాగు చేసుకుంటున్నారు. పంటకు నీరందించేందుకు వ్యవసాయ విద్యుత్ సర్వీసు కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఐదుగురు రైతులకు కలిపి ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తారు. వీరి పరిధిలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ కింద ఇద్దరు రైతులు మాత్రమే ఉండడంతో కొత్త సర్వీస్ కోసం పెంచలమ్మ, మహేష్ దరఖాస్తు చేశారు. ఈ మేరకు సర్వీస్ చార్జీలకు సంబంధించి డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు. అయితే సర్వీస్ మంజూరైనా.. విద్యుత్ స్తంభాలు, కండక్టర్ (వైర్లు) సిద్ధంగా ఉన్నప్పటికీ కనెక్షన్ ఇచ్చేందుకు ఇన్‌చార్జి ఏఈ శ్రీనివాసరావు రూ.40 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ మొత్తాన్ని సదరు రైతులు ఇచ్చినప్పటికీ కనెక్షన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. సదరు రైతులు నిలదీయడంతో ఏఈ శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నాయకుడు మీకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దని చెప్పాడని, మీరెళ్లి ఆ నాయకుడిని కలిస్తే పని అవుతుందని చెప్పడంతో రైతుల బంధువు గాలం హరికృష్ణ వెళ్లి ఏఈని నిలదీశాడు. ఈ క్రమంలో ఏఈ టీడీపీ నేతలకు చెప్పి.. హరికృష్ణను పోలీసులతో కొట్టించడంతో ఈ వివాదం జిల్లాలో సంచలనంగా మారింది.
ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం
విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపంతోనే కింది స్థాయి అధికారులు అవినీతిలో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్ సర్వీసుల కోసం వచ్చిన దరఖాస్తులు ఎంత కాలం, ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి, అందుకు కారణాలను విశ్లేషించి చర్యలు చేపట్టాల్సి ఉన్నా.. అందుకు భిన్నంగా మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు. సర్వీస్ పేరు మార్చడానికి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినప్పుడైనా.. సరే ఉన్నతాధికారులు స్పందించి ఉంటే పొదలకూరు ఘటన జరిగేది కాదు. ప్రతి సోమవారం గంట పాటు డయల్ యువర్ ఎస్‌ఈ, డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహిస్తున్నా.. ఇటువంటి ఫిర్యాదులు వారి దృష్టికి రాకుండానే కాల్ డిస్కనెక్ట్ అయిపోవడం సర్వసాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి.
ప్రతి పనికీ ఒక్కో రేటు
విద్యుత్ శాఖలో ఎలాంటి పని జరగాలన్నా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు ముడుపులు ఇవ్వాల్సిందే. ప్రతి పనికీ ఒక్కో రేటుగా నిర్ణయించుకుని పనులు చేస్తున్నారని పలు ఆరోపణలు ఉన్నాయి. మంజూరైన కొత్త విద్యుత్ మీటర్ పెట్టాలంటే రూ.500 నుంచి రూ.1,000 వసూలు చేస్తున్నారు. విద్యుత్ లైన్ల మార్పిడికి దూరాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు, స్తంభాలను మార్చాలంటే రూ. 5 వేల నుంచి రూ.10 వేల వరకు ముట్ట జెప్పాల్సిందే. ఇక అపార్ట్‌మెంట్ల వద్ద ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ లైన్లకు సంబంధించి సర్వీస్ చార్జీలు కాకుండా.. రూ.60 వేల నుంచి రూ.లక్ష వరకు లంచాల రూపంలో డిమాండ్ చేసి మరీ దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రహసనంగా డయల్ యువర్ ఎస్‌ఈ, సీఎండీ కార్యక్రమం
ఉచిత సేవలకు డబ్బులు వసూళ్లు
ప్రతి పనికీ ఒక్కో రేటు.. అడిగినంత ఇచ్చినా ఫలితం శూన్యం
పరిష్కారం దొరకని డయల్ యువర్ ఎస్‌ఈ, సీఎండీ కార్యక్రమం
రైతులను సైతం వదలని అవినీతి విద్యుత్ అధికారులు
ఉచిత సేవలకు సైతం అదనపు వసూళ్లు
విద్యుత్‌శాఖ నిబంధనల మేరకు వ్యవసాయ సర్వీసు కోసం రైతు దరఖాస్తు చేసుకుంటే ఆ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో సీనియార్టీ ప్రాతిపదికన కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 హెచ్‌పీకి రూ.1500, 2 హెచ్‌పీకి రూ.3000, 3 హెచ్‌పీకి రూ.4500, 4 హెచ్‌పీకి రూ.6000, 5 హెచ్‌పీకి రూ.7500 డిపాజిట్‌ను డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి రైతు పొలంలో ఉన్న పంపుసెట్ వరకు మూడు విద్యుత్ స్తంభాలు, 240 మీటర్ల కండక్టర్ (వైర్లు) ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా దూరం ఉంటే.. విద్యుత్ స్తంభాలు, కండక్టర్ ఖర్చును రైతునే భరించాలి. అయితే విద్యుత్ శాఖాధికారులు వీటిని ఖర్చు పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవు
విద్యుత్‌శాఖ అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వస్తే ఉపేక్షించేది లేదు. రైతులకు మంజారైన వ్యవసాయ విద్యుత్ సర్వీ సులు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. గృహ, వ్యవసాయ విద్యుత్ సర్వీసులు ఇచ్చేందుకు విద్యుత్ అధికారులుకానీ, సిబ్బంది కానీ నగదును డిమాండ్ చేస్తే నా దృిష్టికి తీసుకు వస్తే వారిపై చర్యలు తీసుకుంటాను. నావూరుపల్లిలో వ్యవసాయ విద్యుత్ సర్వీసు విషయంలో ఏఈ రూ. 40 వేలు లంచం తీసుకున్నట్లు ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
– రాఘవేంద్రం,
ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ
రాష్ట్రంలో ఏ ప్రభుత్వ శాఖ, చివరకు బ్యాంకు ఉద్యోగులు సైతం అందుకోని విధంగా అత్యధిక మొత్తాల్లో విద్యుత్‌శాఖ అధికారులు, ఉద్యోగులు జీతాలు అందుకుంటున్నారు. విద్యుత్ శాఖలో విధులు నిర్వహించే లైన్‌మెన్ స్థాయి ఉద్యోగి నెలకు రూ.90 వేల నుంచి రూ. లక్ష, లైన్ ఇన్‌స్పెక్టర్ స్థాయి ఉద్యోగి రూ.1.50 లక్షల నుంచి రూ.1.90 లక్షలు, ఏఈ స్థాయి అధికారి రూ.2 లక్షలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ స్థాయి అధికారి రూ.రూ.2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకూ నెల నెలా జీతాల రూపంలో అందుకుంటున్నారు. అయితే ఇవి చాలదన్నట్టుగా కొందరు లంచాలకు అలవాటు పడిన విద్యుత్ అధికారులు, సిబ్బంది విద్యుత్ వినియోగదారులు, రైతుల నుంచి ముక్కు పిండి మరీ లంచాలను తీసుకుంటూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


