నెల్లూరు (బారకాసు): నగర ప్రజల నుంచి వివిధ పన్ను రూపంలో వసూలు చేస్తున్న సొమ్ముతో నగరాభివృద్ధితోపాటు ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా నగర పాలక సంస్థ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది. ఇటీవల కాలంలో నగర ప్రజల నుంచి పన్నుల పేరుతో రూ.వంద కోట్లకు పైగా కోర్టు నోటీసులు అంటూ భయపెట్టి ముక్కు పిండి మరీ వసూలు చేశారు. ఈ నిధులను పలు అభివృద్ధి పనుల పేరుతో టీడీపీకి చెందిన నాయకులకు కట్టబెడుతున్నారు. మరో వైపు తమ లగ్జరీ జీవనానికి సైతం ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈవీ కార్లు వద్దు.. ప్రైవేట్ కార్లే ముద్దు
నగర పాలక సంస్థలో వివిధ హోదాల్లోని అధికారులు నగర పరిధిలో క్షేత్ర స్థాయిలో తనిఖీలకు, పర్యవేణకు వెళ్లేందుకు గతంలో ప్రైవేట్ కార్లను అద్దెకు పెట్టుకుని వినియోగిస్తున్నారు. దీంతో కార్ల అద్దె భారం కార్పొరేషన్‌పై పడడంతో 9 ఏళ్ల క్రితం అప్పటి కమిషనర్ మూర్తి ఓ మంచి ఆలోచన చేశారు. ప్రైవేట్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లను అద్దెకు చెల్లించే మొత్తాన్ని ఈఎంఐ పద్ధతిలో కొనడం ద్వారా సొంత కార్లు మిగిలిపోతాయని భావించారు. తద్వారా కార్పొరేషన్‌పై ఆర్థిక భారం తగ్గుతుందని ఆలోచన చేసి ఈఎల్‌ఎస్ ఏజెన్సీకు బాధ్యత అప్పగించారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 100 కి.మీ. దూరం తిరిగే సామర్థ్యం ఉన్న ఈవీ కార్లను అప్పట్లో కార్పొరేషన్ అధికారులు కొనుగోలు చేశారు. అప్పట్లో ఒక్కొక్క కారుకు నెలకు రూ.20 వేలు చెల్లించేలా 15 కార్లను కొనుగోలు చేసి సదరు ఏజెన్సీ ఎన్‌ఎంసీకి అందజేసింది. ఎన్‌ఎంసీ ప్రాంగణంలో చార్జింగ్ చేసే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ఎలక్ట్రిక్ కార్లు మరమ్మతులకు గురవుతున్నాయంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేశారు. చిన్న మొత్తంలో ఖర్చు చేయడం ద్వారా తిరిగి వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు సొంత పనులకు తిరగాలంటే కి.మీ. దూరం పెరుగుతుందని, ఈవీ కార్లు అంత దూరం నడిచే అవకాశం లేదని వాటిని క్రమక్రమంగా పక్కన పడేశారు.
నెలకు రూ.4 లక్షలు అద్దె చెల్లింపు
ఎలక్ట్రిక్ కార్లను మూలన పడేసిన అధికారులు ప్రత్యామ్నాయంగా ఎవరికి వారు సొంతంగా ప్రైవేట్ కార్లను ఏర్పాటు చేసుకుని దర్జాగా ప్రజాధనాన్ని దుర్వినియో గం చేస్తున్నారు. ఇందులో మేయర్, ఇంజినీరింగ్ విభాగం ఎస్‌ఈకి పెద్ద కార్లు ఒక్కొక్కదానికి నెలకు రూ.60 వేలు, మిగతా అధికారులకు 8 చిన్న కార్లకు నెలకు రూ.35 వేల లెక్కన అద్దె చెల్లిస్తున్నారు. ఈ లెక్కన నెలకు రూ.4 లక్షలు ఈ రకంగా ఖర్చు పెడుతున్నారు. గతంలో కొనుగోలు చేసిన ఈవీ (ఎలక్ట్రిక్) కార్లను మూలన పడేశారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రజాధనా న్ని కార్పొరేషన్ అధికారులు దర్జాగా ప్రైవేట్ కార్లకు అద్దెలు చెల్లిస్తూ దుర్వినియోగం చేస్తున్నారని నగర ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. రెండేళ్లు ఈవీ కార్లను మూలన పడేయడంతో అందులోని వస్తువులన్నీ తుప్పుపట్టిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రైవేట్ కార్లకు ఎన్‌ఎంసీలో డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని వినియోగిస్తుండడం కొసమెరుపు. ప్రైవేట్ కార్ల డ్రైవర్లకు ఇచ్చే మొత్తాన్ని కూడా సంబంధిత అధికారులు జేబు ల్లోకి వెళ్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూలన పడేసిన ఎలక్ట్రిక్ కార్లు
ప్రైవేట్ వాహనాల్లో
ఎన్‌ఎంసీ అధికారుల దర్జా
నెలకు రూ.4 లక్షల ప్రజాధనం వృథా
ప్రైవేట్ కార్లకు కార్పొరేషన్ డ్రైవర్ల వినియోగం
నగర పాలక సంస్థలో అదనపు ఖర్చులు తగ్గించుకుని ప్రజాధనాన్ని సద్వినియోగం చేయాలనే ఆశయంతో అప్పటి కార్పొరేషన్ కమిషనర్ ఎలక్ట్రిక్ (ఈవీ) కార్లను ఈఎంఐ పద్ధతిలో కొని వినియోగంలోకి తెచ్చారు. ప్రైవేట్ వాహనాలకు చెల్లించే అద్దెతో కార్పొరేషన్‌కు సొంతంగా వాహనాలు సమకూరుతాయని భావిస్తే.. నేటి అధికారులు ఆ గొప్ప సంకల్పానికి తిలోదకాలిచ్చారు. కార్పొరేషన్‌కు వాహనాలు సమకూరినా.. చిన్నపాటి మరమ్మతులు వస్తే పక్కన పడేసి ప్రైవేట్ కార్లకు అద్దెలు చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.


