బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభోవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కామాక్షితాయి పురుషామృగ వాహనంపై కొలువుదీరి విశేష పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవదేవేరులను దర్శించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ అశోక్‌రెడ్డి, ఆలయ సహాయ కమిషనర్ వెంకట శ్రీనివాసులురెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు నక్కల శివకృష్ణ, వరలక్ష్మి, చాముండేశ్వరి, ప్రత్యూష, శ్రీనివాసులు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
15న ఉద్యోగులు, ఎస్సీ,
ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్‌డే
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: ఈ నెల 15న ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీలకు సంఘాలకు సంబంధించి ప్రత్యేక గ్రీవెన్‌న్స్‌డే నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉద్యోగులకు సంబంధించి గ్రీవెన్స్ స్వీకరించనున్నట్లు, 12.30 గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ముందస్తుగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, సంఘాలకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కాకాణితోపాటు
పలువురిపై కేసు నమోదు
పొదలకూరు: మండలంలోని నావూరుపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, రైతు గాలం హరికృష్ణను అకారణంగా పొదలకూరు ఎస్సై హనీఫ్ స్టేషన్‌లో పెట్టి కొట్టడం, ఆ దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించిన దాష్టీకంపై మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అదే రోజు రాత్రి కాకాణితో పాటు అంజాద్, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వెంకటశేషయ్య, రమేష్, హరి మరికొందరిపై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతోపాటు, ప్రజలకు ఇబ్బందులు కలిగించారని స్టేషన్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
33 టన్నుల రేషన్
బియ్యం పట్టివేత
నెల్లూరు (పొగతోట): అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశాల ప్రకారం ఆదివారం పౌరసరఫరాల శాఖ అఽధికారులు వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల పీడీఎస్ రైస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ 10 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా. బియ్యం తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేశారు. ఈ తనఖీల్లో ఏఎస్‌ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్‌డీటీ సైమన్‌బాబు, ఎఫ్‌ఐ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు.


