చిట్టమూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పంటలకు కనీసం ధరలు కూడా ఉండడం లేదు. ఏడాదికేడాది ధరలు పతనమవుతున్నా.. పాలకులకు, అధికార యంత్రాంగానికి పట్టడం లేదు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో దళారులు ధరలు తగ్గిస్తే.. వెంటనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకునేది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నా.. పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. మండలంలో అత్యధికంగా వరి సాగు చేస్తుంటారు. రెండేళ్లుగా ధాన్యానికి ధరల్లేకపోవడంతో ఈ దఫా మెట్ట ప్రాంతాల్లో రైతులు వాణిజ్య పంట ఎండు మిర్చి సాగు చేశారు. కనీసం మిర్చితోనైనా అప్పుల ఊబిలో నుంచి బయటపడుతామని ఆశతో ఉన్న రైతుల కళ్లల్లో దళారులు కారం కొడుతున్నారు.
క్వింటాకు రూ.6 వేల తగ్గింపు
పది రోజుల ముందు వరకు కిలో ఎండు మిర్చి ధర రూ.400 ఉండగా, ప్రస్తుతం కేజీ రూ.340 మాత్రమే దళారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాకు రూ.6 వేల నష్టపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లాలోకి వచ్చి కొనుగోలు చేసే దళారులు సిండికేట్ కావడంతో నెల్లూరుకు తీసుకువచ్చి అమ్మాలంటూ డిమాండ్ పెట్టడంతో రవాణా చార్జీలు అదనంగా తమపై పడడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ధరకు గిట్టుబాటు కాకపోవడంతో రైతులు నెల్లూరులోని పొట్టేపాళెంలో ఉన్న కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకుంటున్నారు. దీంతో అదనపు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. కొంత మంది రైతులు ఇంటికి తీసుకు వచ్చి కల్లాల్లో ఎండ బెట్టుకుంటున్నారు.
దిగుబడి ఆశ.. ధర నిరాశ
మంచి గిట్టుబాటు ధర ఉంటుందని రైతులు మండలంలో హైబ్రీడ్ వంగడం కాకుండా దేశీయ వంగడాన్ని సాగు చేశారు. చిల్లమూరు, రామాపురం, చిట్టమూరు, మొలకలపూడి గ్రామాల్లో సుమారు 300 ఎకరాల్లో రైతులు మిరప పంట సాగు చేశారు. ఈ ఏడాది ఎకరాకు 10 నుంచి 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు తెలిపారు. ఆశించిన మేర దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధరల్లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఎకరా మిరప పంట సాగుకు మొత్తం కూలీలతో కలిపి రూ.80 నుంచి 90 వేలు వరకు ఖర్చు అవుతుందన్నారు. పది రోజుల ముందు కోత కోసిన రైతులకు మాత్రం ఎకరాకు 10 క్వింటాళ్లకు రూ.4 లక్షలు వరకు గిట్టుబాటు అయిందన్నారు. ప్రస్తుతం ధర తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.


