నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది విద్యా సంవత్సరం నుంచి మరో 50 ఎంబీబీఎస్ సీట్లు పెరగడంతో 225 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన ప్రభుత్వ మెడికల్ కళాశాల నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరు కాగా, 150 సీట్లతో 2014లో ప్రారంభమైంది. అయితే నాటి టీడీపీ ప్రభుత్వం కళాశాలలో తగిన వసతులు కల్పించకపోవడం, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీ చేసి మెడికల్ సీట్లకు కోత పెట్టింది. తర్వాత ప్రభుత్వం వసతులు కల్పిస్తామని, ఎన్‌ఎంసీ నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వడంతో మెడికల్ కళాశాలలో సీట్ల కోత ఎత్తేశారు. ఇలా రెండు దఫాలు జరిగింది. 2019లో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాల, అనుబంధ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఖాళీలను వరుస నోటిఫికేషన్లతో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని భర్తీ చేసింది. సిటీ, ఎంఆర్‌ఐ వంటి అత్యాధునిక వైద్య యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. మౌలిక వసతులు కల్పించారు. దీంతో మళ్లీ తనిఖీలకు వచ్చిన ఎన్‌ఎంసీ అధికారులు ఎంబీబీఎస్ సీట్లను 150 నుంచి 175కి పెంచింది. అదే సమయంలో పీజీ సీట్లను మంజూరు చేసింది. ఇప్పటి వరకు 2015, 2016, 2017, 2018, 2019, 2020, 2021లకు చెందిన 7 బ్యాచ్‌లు ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పట్టాలు అందుకున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా తాజాగా మరో 50 మెడికల్ సీట్లు నెల్లూరు వైద్యకళాశాలకు అదనంగా రానున్నాయి. ఫలితంగా రోగులకు నాణ్యమైన వైద్యం అందనుంది.
2023లో పీజీ కోర్సులు ప్రారంభం
అన్ని రకాల వసతులు, ఫ్యాకల్టీలను అందుబాటులో తీసుకురావడంతో న్యూరాలజీ, యురాలజీ, న్యూరో సర్జరీ విభాగాలను మంజూరు చేసింది. గతంలో కేన్సర్ విభాగంలో ఒకే ఒక డాక్టరుండే వారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేన్సర్ విభాగంలో ముగ్గురు డాక్టర్లను నియమించారు. 2023 నుంచి ఎండీ, ఎంఎస్ వంటి ఎంబీబీఎస్ తర్వాత చదివే స్పెషాలిటీ పీజీ కోర్సులను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రారంభించారు. దీంతో రోగులకు ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందుబాటులోకి వచ్చా యి. క్రిటికల్ కేర్ యూనిట్, సెంట్రల్ ల్యాబ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రభుత్వ మెడికల్ కళాశాల
మెడికల్ కళాశాలలో ఈ ఏడాది నుంచి మరో 50 సీట్లు పెరుగుదల
150 నుంచి 225 మెడికల్ సీట్లకు ఎదిగిన కళాశాల
2023లో పీజీ కోర్సులను ప్రారంభించిన నాటి సర్కారు
పూర్తి స్థాయిలో డాక్టర్లు, సిబ్బంది నియామకానికి చర్యలు
నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలే నేటి ఫలితాలు
225 ఎంబీబీఎస్.. 55 పీజీ సీట్లతో..
ప్రభుత్వ మెడికల్ కళాశాల తగినంత మంది డాక్టర్లు, సిబ్బంది సంతృప్తి స్థాయిలో ఉండడంతో పాటు క్వార్టర్స్, హాస్టల్ వసతి, ఆధునిక భవనాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో 800 నుంచి 1000 వరకు ఉండే ఓపీ ఇప్పుడు 1500 వరకు పెరిగింది. విషయాన్ని పరిశీలించిన ఎన్‌ఎంసీ అధికారులు మరో మెడికల్ సీట్లు పెంచేందుకు అంగీకరించింది. 150 సీట్లతో మొదలైన మెడికల్ కళాశాల క్రమేపి 225 సీట్లకు చేరుకోబోతోంది. అంతేకాకుండా 55 పీజీ సీట్లతో కళాశాల, ఆస్పత్రి నడుస్తున్నాయి. దీంతో రోగులకు నాణ్యమైన స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు వీలవుతోంది.
నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల మరో ముందడుగు వేసింది. 2019–24 మధ్య నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పటికే ఎంబీబీఎస్‌లో 25 సీట్లు పెరగ్గా.. తాజాగా మరో 50 సీట్లు మంజూరుకు ఎన్‌ఎంసీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ ప్రభుత్వ హయాంలోనే 55 పీజీ సీట్లు అందుబాటులోకి రావడం గమనార్హం. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు మెడికల్ కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉన్న సీట్లను రద్దు చేస్తామని అప్పట్లో ఎన్‌ఎంసీ హెచ్చరించడం తెలిసిందే.
50 మెడికల్ సీట్లు పెరగనున్నాయి
ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. వీటిని 225 పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్‌ఎంసీకి పంపాం. అందుకు అవసరమైన ప్రాథమిక ఫీజును రూ. 5 లక్షలు ఎన్‌ఎంసీకి చెల్లించాం. త్వరలోనే అదనపు మెడికల్ సీట్లు మంజూరు కానున్నాయి. మెడికల్ సీట్లు పెరిగితే అందుకనుగుణంగా వైద్య సేవలు పెరుగుతాయి. నాణ్యమైన సేవలు రోగులకు అందుతాయి.
– డాక్టర్ రాజేశ్వరి, ప్రిన్సిపల్, ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల


