పొదలకూరు : స్థానిక ఎస్సై హనీఫ్ ‘పచ్చ’ కావరంతో వ్యవహరించిన తీరుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు కదం తొక్కారు. మండలంలోని నావూరుపల్లికి చెందిన రైతు హరికృష్ణ తన పొలానికి విద్యుత్ కనెక్షన్ నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లించడంతోపాటు సంబంధిత ఏఈకి రూ.40 వేలు లంచంగా ఇచ్చినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడంతో టీడీపీ నేతల జోక్యంతో ఎస్సై అతన్ని స్టేషన్‌కు తీసుకువచ్చి కొడుతూ వీడియో కాల్‌లో టీడీపీ నేతలకు చూపించారు. ఈ దాష్టీకాన్ని నిరసిస్తూ.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పొదలకూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఎస్సై హనీఫ్ తీరుకు నిరసనగా మండుటెండలో ధర్నా నిర్వహించారు. సుమారు గంటకుపైగా ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు. ఎస్సై తీరు ఏకపక్షంగా ఉందని సివిల్ వివాదాల్లో తలదూర్చుతూ వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను దుర్మార్గంగా దుర్భాషలాడడమే కాక ఇష్టానుసారం కొడుతున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పొదలకూరు సీఐ గుత్తి వెంకటరావు కాకాణి వద్దకు వెళ్లి ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని నిరసన విరమించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కాకాణి పోలీసుల తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. ఫిర్యాదు లేకుండా రైతులను స్టేషన్‌కు పిలిపించి కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారన్నారు. డీటీసీ డీఎస్పీ గిరిధర్ వచ్చి ఎస్సైపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో డీఎస్పీ మాటపై గౌరవంతో నిరసన విరిమిస్తున్నట్లు కాకాణి వెల్లడించారు. ఎస్సైపై చర్యలు తీసుకోకుంటే తిరిగి ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
కార్యకర్తలపై దెబ్బపడితే నాపై పడినట్టే
– కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దెబ్బపడితే నాపై పడినట్టే అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ నాయకుల మాటలు విని పోలీసులు ఓవరాక్షన్ చేస్తే చట్టం ముందు నిలబెట్టి భవిష్యత్‌లో ఉద్యోగంలో లేకుండా చేస్తామన్నారు. కూటమి పాలనలో దౌర్జన్యాలు పెరిగిపోయాయని అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులను ప్రయోగించి తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులతోపాటు కొడుతున్నారని ఆరోపించారు. హరికృష్ణను ఎస్సై హనీఫ్ విచక్షణారహితంగా కొట్టి హింసించాడని, ఆ దృశ్యాలను టీడీపీ నాయకులకు వీడియో కాల్‌లో చూపడం ఎంత దుర్మార్గమో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు విచారణ జరపాలన్నారు. పోలీస్ అధికారి టీడీపీ నాయకుల వద్దకు వెళ్లాలంటూ చెప్పడం సిగ్గు చేటన్నారు.
సర్వేపల్లిలో ధనప్రవాహం
సర్వేపల్లిలో అధికారులు ప్రజల వద్ద దండుకుని సోమి రెడ్డికి లంచాలు ఇస్తున్నారని కాకాణి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే పొదలకూరు విద్యుత్ ఏఈ వ్యవహారం నెలకొందన్నారు. నాయకులకు లంచాలు ఇవ్వకుంటే సర్వేపల్లిలో పోస్టింగ్ రాదని అధికారులు, ఉద్యోగులే బహిరంగంగా చెబుతున్నారన్నారు. సోమి రెడ్డి ఆయన కుమారుడు పొదలకూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లేఅవుట్ల నుంచి రూ.2.50 కో ట్లు వసూలు చేసినట్టు ఆరోపించారు. ధర్నాలో నాయకులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, ఎం.వెంకటశేషయ్య, వూకోటి లక్ష్మీనారాయణ, జీ.లక్ష్మీకల్యాణి, తెనాలి నిర్మలమ్మ, ఎస్‌కే అంజాద్, మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శివప్రసాద్‌రెడ్డి, సీహెచ్ రమేష్, ఆనంద్‌రెడ్డి, వి.దయాకర్‌రెడ్డి, రావుల ఇంద్రసేన్‌గౌడ్, జీ.వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.


