● జస్టిస్ చంద్రు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): భారత లౌకిక రాజ్యాంగంలోని ఫలాలు దేశ పౌరులందరికీ అందాలని తమిళనాడు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు అన్నారు. నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఆవాజ్ 3వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సభల్లో మొదటి రోజు శనివారం ఆవాజ్ పతాకాన్ని ఆవాజ్ సీనియర్ నాయకులు రియాజ్, ఎస్‌ఎం బాషా ఆవిష్కరించారు. అనంతరం ‘భారతరాజ్యాంగం– లౌకిక వాదం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో జస్టిస్ చంద్రు మాట్లాడుతూ నేడు దేశంలో లౌకికవాదం చాలా ప్రమాదంలో ఉందన్నారు. అయితే కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసి నేడు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు ఆవాజ్ మహాసభల్లో చర్చించి తీర్మానాలు చేయా లని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్, ఆవాజ్ రాష్ట్ర, జిల్లా నా యకులు డాక్టర్ రఫీ, జాషువా, డాక్టర్ ఖాజారసూల్, ససుభాహాన్, చిష్టి, సీఐటీయూ నాయకులు ఉమామహేశ్వ రరావు, రఫీ తదితరులు పాల్గొన్నారు.


