● ప్రశ్నించినందుకు
బాధితురాలి తల్లిపై దాడి
ఆత్మకూరు: అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడని, తమ కుమార్తె కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కావడంతో ఇరువురు అన్యోన్యంగా ఉంటారని వివాహం చేస్తే అదనపు కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారని, ఇదేమి న్యాయం అని అడిగేందుకు ఇంటికి వెళ్తే గాయపరిచారని బాధిత తల్లి వాపోయింది. వివరాల్లోకెళ్తే.. నెల్లూరుకు చెందిన అనసూయ, నారాయణ దంపతులు పూణేలో నివసిస్తుంటారు. వీరి కుమార్తె నవీనను ఆత్మకూరుకు చెందిన డి.మాల్యాద్రి, లలితమ్మ కుమారుడు వినీత్ అనే యువకుడికి ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. అయితే పెళ్లయిన నెల నుంచే కట్నం కోసం అమ్మాయిని వేధిస్తుండడంతో ఎన్నిసార్లు మధ్యవర్తిత్వం చేసినా కుదరలేదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం ఆత్మకూరు పోలీసులకు అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇంటికి వస్తే అమ్మాయి దుస్తులు ఇస్తామని వియ్యంకులు చెప్పడంతో అనసూయ, తన సమీప బంధువుతో కలిసి వెళ్లగా నానా దుర్భాషలాడి ఇద్దరిపై దాడి చేసి తరిమేశారని వాపోతూ తిరిగి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్సై జిలానీతో తమకు జరిగిన విషయాన్ని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
నడిరోడ్డుపై కత్తి చేతపట్టి..
● మద్యం మత్తులో యువకుడి హల్‌చల్
ముత్తుకూరు (పొదలకూరు): మండలంలోని పిడతాపోలూరులో మద్యం మత్తులో గుర్తుతెలియని యువకుడు శనివారం రాత్రి కత్తి చేతపట్టి హల్‌చల్ చేశాడు. ఆ యువకుడు మద్యం మత్తులో నడిరోడ్డుపై నిలబడి కత్తి చేతబట్టి తిరుగుతుండటంతో వాహనచోదకులు భీతిల్లారు. మద్యం ఎక్కడపడితే అక్కడ లభ్యం కావడం వల్లనే యువకులు అతిగా మద్యం సేవించి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మత్తులో జోగుతున్న ఆ యువకుడిని అతికష్టంపై అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
కొనదిన్నె కాలనీలో
కార్డెన్ సెర్చ్
కావలి: మండలంలోని తుమ్మలపెంట రోడ్డు శివారు కొనదిన్నె గిరిజన కాలనీలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 150పైగా నివాసాలను పరిశీలించడంతో పాటు సరైన పత్రాల్లేని 44 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమ మద్యం, జూదం, బెట్టింగ్‌లు వంటి కార్యకలాపాలకు పాల్పడేవారి గురించి తమకు తెలియజేయాలన్నారు.


