పెళ్లికెళ్లి వస్తుండగా ఘోరం | - | Sakshi
Sakshi News home page

పెళ్లికెళ్లి వస్తుండగా ఘోరం

May 10 2026 8:22 AM | Updated on May 10 2026 8:22 AM

ఆవును తప్పించబోయి

టాటా దోస్త్‌ వాహనం బోల్తా

మహిళ మృతి,

పది మందికి తీవ్రగాయాలు

మర్రిపాడు: పెళ్లికెళ్లి ఆనందంగా వస్తున్న కుటుంబంలో ఓ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆవును తప్పించబోయి టాటా దోస్తు వాహనం బోల్తా పడడంతో ఓ మహిళ మరణించగా, పది మంది తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని చుంచులూరు కొత్తపల్లి గ్రామ సమీపంలోని 565 జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కలువాయికి చెందిన 20 మంది వైఎస్సార్‌ కడప జిల్లా ఖాజీపేటలో ఓ వివాహ కార్యక్రమానికి టాటా దోస్తు వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆనందంగా వస్తుండగా చుంచులూరు కొత్తపల్లి సమీపంలో ఎదురుగా వచ్చిన ఆవును తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రామసుబ్బమ్మ(55) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో చంద్రశేఖర్‌ అనే యువకుడి ఎడమ చేయి పూర్తిగా తెగిపోయింది. మరికొందరికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement