తగలబడిందా?.. తగలబెట్టారా? | - | Sakshi
Sakshi News home page

తగలబడిందా?.. తగలబెట్టారా?

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

అల్లీపురం డంపింగ్‌ యార్డులో

పెద్దఎత్తున మంటలు

కార్పొరేషన్‌ సిబ్బందిపైనే అనుమానం

గత 15 రోజులుగా పేరుకుపోయిన చెత్త

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌ పరిధిలోని అల్లీపురంలోని డంపింగ్‌ యార్డులో శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. ఫైరింజిన్‌ అక్కడికి చేరుకుని మంటలు ఆ ర్పింది. ఇదిలా ఉండగా చెత్తను ఎవరైనా తగలబెట్టారా? లేదా తగలబడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నెల్లూరులోని డివిజన్ల నుంచి రోజూ చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్‌యార్డుకు తరలిస్తారు. అక్కడ్నుంచి టిప్పర్‌లు, కాంపాక్టర్‌ల ద్వారా దొంతాలి డంపింగ్‌ యార్డుకు పంపుతున్నారు. అయితే 15 రోజులుగా అల్లీపురం యార్డులో పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ట్రాక్టర్ల ద్వారా చెత్తను తీసుకొచ్చినా లోపల వేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. లోపలున్న చెత్త బయటకు వెళ్లేందుకు టిప్పర్లను అధికారులు కేటాయించకపోవడం, కాంపాక్టర్లు సరిపోకపోవడంతో చెత్త టన్నుల్లో పేరుకుపోయింది. నగరం నుంచి వచ్చే ట్రాక్టర్లు రెండురోజులుగా రోడ్డు పక్కన నిలుపుతున్న పరిస్థితి ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది.

అనేక సందేహాలు

అల్లీపురంలోని డంపింగ్‌ యార్డులోని చెత్తను దొంతాలికి తరలించే పరిస్థితి లేకపోవడంతో కార్పొరేషన్‌ సిబ్బంది చెత్తను తగలబెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిరోజులుగా చెత్త లోపలికి వెళ్లలేని పరిస్థితిని బట్టి అనేకమంది ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్‌ యార్డుకు సమీపంలో ఇళ్లు ఉన్నాయి. చెత్త తగలబడటంతో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని కన్నీరుమున్నీరయ్యారు.

మంత్రి నారాయణ హామీ ఏమైంది?

అల్లీపురంలో డంపింగ్‌ యార్డును ఇక్కడ్నుంచి నెలల వ్యవధిలోనే తొలగిస్తామని మంత్రి నారాయణ గతేడాది మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. అయితే అది మాటలకు పరిమితమైంది. ఆచరణలోకి రాలేదు. నెల్లూరు నుంచి అల్లీపురం వైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు నిత్యం కంపును భరించలేక ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు రోడ్లపైనే చెత్త పేరుకుపోయిన సందర్భాలున్నాయి. కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు ఏ మ్రాతం పట్టించుకున్న దాఖలాల్లేవు.

Advertisement
 
Advertisement
Advertisement