చిల్లకూరు: పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం గూడూరు రూరల్ ప్రాంతంలోని చెన్నూరు గ్రామంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు యువకులు గూడూరు రూరల్ ప్రాంతంలోని కలర్ షైన్ పరిశ్రమలో పనిచేసేందుకు ఈనెల 5వ తేదీన మంగళవారం రాత్రి వచ్చారు. వీరిని పరిశ్రమలో లేబర్ కాంట్రాక్ట్ చేసే భానుప్రతాప్ సింగ్, అనిల్‌కుమార్ పిలిపించినట్లు సమాచారం. వారు యువకులకు చెన్నూరులో ఐఓబీ బ్యాంక్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసిచ్చారు. 11వ తేదీ నుంచి పరిశ్రమలో విధుల్లో చేరాల్సి ఉంది.
ఏమైందో..
7వ తేదీ గురువారం రాత్రి యువకుల మధ్య ఏం జరిగిందో తెలియదు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని వెళ్లి చూసేసరికి సుమారు 20 ఏళ్ల వయస్సున్న యువకుడు రక్తమడుగులో పడి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. రూరల్ సీఐ కిశోర్‌బాబు, ఎస్సై తిరుపతయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి యువకుడి హత్య విషయంపై ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో ఏఎస్పీ సౌజన్య, ఇన్‌చార్జి డీఎస్పీ గిరిధర్, గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను పిలిపించారు. వేలిముద్రలు సేకరించారు. రూరల్ సీఐ మాట్లాడుతూ యువకుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చన్నారు. హత్య జరిగిన గదిలో ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారన్నారు. మృతుడికి చెందిన ఆధార్‌కార్డు తదితరాలను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీంతో లేబర్ కాంట్రాక్టర్ల ద్వారా విషయం తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులకు సమా చారం అందిస్తామన్నారు. హత్యకు దారి తీసిన విషయాలను తెలుసుకోవడంతోపాటు మిగిలిన యువకుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
పరిశ్రమలో పనిచేసేందుకు రాక
సహచరులపై అనుమానం
ఆధారాలు దొరక్కుండా చేసిన వైనం


