నెల్లూరులో పట్టపగలు భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

నెల్లూరులో పట్టపగలు భారీ చోరీ

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

రూ.15 లక్షల నగదు,

183 గ్రాముల బంగారం

అపహరణ

నెల్లూరు(క్రైమ్‌): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు రూ.15 లక్షల నగదు, 183 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన శుక్రవారం పట్టపగలు చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మనుమసిద్ధి నగర్‌లో మహేశ్వరి కుటుంబం అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మృతిచెందాడు. నెల్లూరులో ఇల్లు కొనుక్కునేందుకు గానూ తనకున్న ఆస్తులను అమ్మగా సుమారు రూ.15 లక్షలు వచ్చాయి. వాటిని ఇంట్లోనే భద్రపరిచారు. గతనెల 30వ తేదీన తన సోదరి వివాహ నిమిత్తం ఆమె పిల్లలతో కలిసి కోడూరుపాడుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమానులు మిద్దైపెకి వెళ్లే గేటు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి పైకి వెళ్లిచూడగా మహేశ్వరి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఆమెకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. బాధితురాలు బంధువులతో కలిసి ఇంటికి చేరుకుంది. బీరువాలోని నగదు, 183 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావు, ఎస్సై అబ్దుల్‌ రజాక్‌ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌ వేలిముద్రలను సేకరించింది. ఇన్‌స్పెక్టర్‌ సాంకేతికత ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. పక్కాగా రెక్కీవేసి నిందితులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement