మెప్మా కార్యాలయం | - | Sakshi
Sakshi News home page

మెప్మా కార్యాలయం

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

మూలాపేటకు చెందిన పేద మహిళలు గ్రూపుగా ఏర్పడి పొదుపు చేస్తూ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటూ క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారు. మూడు నెలల కిందట గ్రూపు సభ్యులకు బ్యాంకు అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. వెళ్లి బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తే బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నారు. తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతోందని నోటీసులిచ్చామని సమాధానం చెప్పారు. మాకు తెలియకుండా రుణాలు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించినా సమాధానం లేదు. మీ గ్రూపునకు రుణాలిచ్చాం తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారుల దబాయించడంతో ఆ గ్రూపు సభ్యులు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. వేదాయపాళెంలో మరో పొదుపు గ్రూపులోని సభ్యులకు తెలియకుండా రూ.20 లక్షలు రుణం మంజూరు చేయించారు. విషయం తెలుసుకుని సిబ్బందిని నిలదీయడంతో గొడవ జరిగింది.

ఇటీవల నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలోని మెప్మా ఆర్‌పీఎంలు కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ ఎన్టీఆర్‌నగర్‌ గిరిజన కాలనీకి చెందిన మహిళలను మోసం చేసే ప్రయత్నం వెలుగుచూసింది. ‘శ్రీ మణికంఠ’ అనే గ్రూపు పేరుతో రూ.12 లక్షల రుణాలు మంజూరు చేయించారు. అందులోని 12 మంది సభ్యులకు తలా రూ.20 వేలు చేతిలో పెట్టి.. మిగతా నిధులు కాజేసే యత్నం బెడిసి కొట్టడంతో ఆర్‌పీఎంలు వారి బ్యాంక్‌ ఖాతాలను ఫ్రీజ్‌ చేయించారు. వాస్తవానికి పడుగుపాడు డీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. కానీ వీరికి నెల్లూరు నగరంలోని కెనరా బ్యాంక్‌లో అకౌంట్లు ఓపెన్‌ చేయించి వీరిది పట్టణ ప్రాంతంగా చూపించి నిధులు కాజేసేందుకు కుట్ర చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

నెల్లూరు (పొగతోట): జిల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి మాఫియా రాజ్యమేలుతోంది. పేద మహిళల ఆత్మ నిర్భరత కోసం ఏర్పాటు చేసిన మెప్మా విభాగాన్ని కొందరు అవినీతి సామ్రాజ్యాంగా విస్తరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూపు సభ్యులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి భారీ మొత్తాల్లో రుణాలు మంజూరు చేయించడం, బినామీ గ్రూపులను సృష్టించి నిధులు కాజేయడం, ఆన్‌లైన్‌ నమోదు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని నెలలుగా సుమారు రూ.100 కోట్లపైగా రుణాలు స్వాహా అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం కూటమి కీలక నేత వరకు వెళ్లినా మౌనం వహిస్తున్నట్లు సమాచారం.

పొదుపు మహిళపై అవినీతి పంజా

జిల్లాలోని నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీ పరిధిలో సుమారు 30 వేలకుపైగా పొదుపు గ్రూపులు మెప్మా ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయా గ్రూపుల్లో సుమారు 4 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. మహిళా సాధికారత కోసం ఏటా బ్యాంక్‌ లింకేజీతో రూ.కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.518 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. మహిళలు 10 మంది గ్రూపుగా ఏర్పడి బ్యాంకులో ఖాతాను ప్రారంభించి పొదుపు చేస్తారు. ఏ బ్యాంకులో అకౌంట్‌ ఉండి పొదుపు చేస్తున్నారో అదే బ్యాంకు ద్వారా సభ్యులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే మెప్మాలో నిబంధనలకు విరుద్ధంగా గ్రూపుల పేరుతో అనేక బ్యాంక్‌ల్లో ఖాతాలు తెరిచి వందల కోట్ల రుణాలు మంజూరు చేయించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాలా గ్రూపుల సభ్యులకు తెలియకుండానే రుణాలు మంజూరు చేయించి ఆ మొత్తాలను తమ ఖాతాలకు మళ్లించుకుని నిధులు స్వాహా చేసినట్లు ఇటీవల బ్యాంకుల నుంచి సదరు సభ్యులకు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు పంపడంతో వెలుగులోకి వచ్చాయి. కొన్ని గ్రూపు సభ్యుల పేరుతో రుణాలు మంజూరు చేయించి.. తృణమో.. పణమో ఇచ్చి మిగతా డబ్బులను స్వాహా చేస్తున్నట్లు కూడా సమాచారం.

తీసుకున్న రుణాలతో వడ్డీల వ్యాపారం

గ్రూపు మహిళలు పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. పట్టణాల్లో అధిక శాతం మంది పేద మహిళలు గ్రూపులకు దూరంగా జీవిస్తున్నారు. డబ్బులు ఉన్న మహిళలు, మధ్య తరగతి మహిళలు అధిక శాతం మంది గ్రూపుల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు బ్యాంకుల నుంచి రూ.20 లక్షలు రుణంగా తీసుకుంటున్నారు. రుణం మంజూరు అయినట్లు గ్రూపుల్లో ఇతర మహిళలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. తీసుకున్న రుణాన్ని వడ్డీలకు ఇవ్వడం, లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం చేస్తున్నారు. మూడు రూపాయలు వడ్డీ వేసుకున్న నెలకు రూ.60 వేలు వస్తుంది. ఈ విధంగా సంపాదించే వారు పట్టణాల్లో అధిక శాతం ఉన్నారు.

బ్యాంక్‌

మేనేజర్‌

న్యాయ

పోరాటం చేద్దాం

పొదుపు గ్రూపు

ఆన్‌లైన్‌ పేరుతో దోపిడీ

గ్రూపు సభ్యుల వివరాలు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ జరుగుతోంది. వివరాలు ఆన్‌లైన్‌ చేయడానికి వేలకు వేలు డిమాండ్‌ చేస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మహిళ సభ్యులు కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్‌లో పేర్లు వివరాలు నమోదు చేయకపోతే రుణాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవీ అందవని ప్రచారం చేశారు. దీంతో మహిళలు వారి వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నగదు ఇవ్వనిదే సిబ్బంది ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడంలేదు. గ్రూపు మహిళల పూర్తి వివరాలు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వివరాలు, బకాయిలు పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి మెప్మా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయిస్తున్నారు. ఉచితంగా చేయాల్సిన ప్రక్రియకు నగదు డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం.

రూ.100 కోట్లకు పైగా పొదుపు గ్రూపుల పేరిట స్వాహా?

సంఘాల సభ్యులకు

తెలియకుండానే రుణాలు

భారీ ఎత్తున బినామీ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అనుమానాలు

బ్యాంక్‌ మేనేజర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో కలిసి అక్రమాలు

రుణ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులివ్వడంతో అవినీతి బట్టబయలు

ఎన్‌ఓసీ లేకుండానే రుణాలు

వాస్తవానికి బ్యాంకు రుణాలు మంజూరు చూసే క్రమంలో నో అబెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా నగరంలోని మెప్మా సిబ్బంది, అధికారులు, గ్రూపు సభ్యులు కుమ్మకై ఎన్‌ఓసీలు లేకుండానే, నెల్లూరు నగర పరిధిలో బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి రూ.కోట్ల స్వాహా చేసినట్లు సమాచారం. ఇలాంటి విషయాలు బయటకు పొక్కడంతో సిబ్బందిని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా డివిజన్లల్లో కూటమి నేతలు వారికి అవసరమైన, అనుకూలంగా ఉండే వారి వివరాలను కీలక నేత సతీమణికి అప్పగించారు. పాత సిబ్బందిని తొలగించి కొత్త వారిని తీసుకునేందుకు అప్పటి అధికారుల వద్ద చర్చలు జరిగాయి. ఏమి జరిగిందో తెలియదు.. తిరిగి పాత వారినే కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని, దీంతో ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై అనేక మంది ఆర్‌టీఐ యాక్ట్‌ ద్వారా ఎన్‌ఓసీలు ఎంత ఎన్ని గ్రూపులకు ఇచ్చారు వివరాలు అడిగితే అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం. బ్యాంకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా కనిపిస్తోంది.

పరిశీలించి చర్యలు తీసుకుంటాం

గ్రూపులకు అకౌంట్‌ ఉన్న బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. గ్రూపునకు ఒక బ్యాంకులోనే అకౌంట్‌ ఉంటుంది. ఒకే గ్రూపు రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడంపై పరిశీలిస్తాం. గతంలో ఈ విషయానికి సంబంధించి ఏదైనా ఫైల్‌ పెట్టారో లేదో చూస్తాను. పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

– కిరణ్‌కుమార్‌, మెప్మా పీడీ

Advertisement
 
Advertisement
Advertisement