విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్‌ కోర్టుకు కాకాణి కేసు బదిలీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్‌ కోర్టుకు కాకాణి కేసు బదిలీ

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

కోర్టు విచారణకు గోవర్ధన్‌రెడ్డి హాజరు

నెల్లూరు (లీగల్‌): సోమిరెడ్డి అక్రమాస్తులను కలిగి ఉన్నాడంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని 2017లో ఆయనపై నమోదైన కేసులో ఎగ్జామినేషన్‌ పూర్తి కావడంతో నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి నిసాద్‌నాజ్‌ షేక్‌ కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్‌ కోర్టుకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణకు కాకాణితోపాటు పసుపులేటి చిరంజీవి, వెంకటకృష్ణన్‌, హరిహరణ శుక్రవారం హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌లోని అభియోగాలను న్యాయమూర్తి నిసాద్‌నాజ్‌ షేక్‌ తెలుగులో చదివి వినిపించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని కాకాణి న్యాయమూర్తికి వివరించారు. ఈ మేరకు కేసును విజయవాడ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు.

సోమిరెడ్డి తాతలు దిగి రావాలి

‘సోమిరెడ్డి అనే వాడు ఓ అవినీతి పరుడు. కాకాణిపై తప్పుడు కేసులు పెట్టించి ఆయనేదో నిజాయితీ పరుడన్నట్లు తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నాడు. మాజీ కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను సోమిరెడ్డి కాదు కదా.. ఆయన తాతలు దిగొచ్చినా నిరూపించలేరు. తప్పుడు కేసులకు భయపడే పిరికి తనం కాకాణిలో లేదు. దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొంటారు.’ అని ఆయన అనుచరులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోమిరెడ్డికి ఇతర దేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని కాకాణి మీడియా సమావేశంలో ఆరోపించారు. అయితే సోమిరెడ్డి తనకు అక్రమ ఆస్తులు లేవని నిరూపించుకోలేక 2017లో కాకాణి పై తప్పుడు కేసు బనాయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన నాటి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు కేసుకు విచారణ అర్హత లేదని ప్రభుత్వానికి నివేదించి, కేసును తీసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన ఫైళ్లు దొంగతనానికి గురయ్యాయి. అయితే సోమిరెడ్డి పదే పదే కోర్టులో ఫైళ్లు గల్లంతు విషయమై కాకాణి పాత్ర ఉన్నట్లు విష ప్రచారం చేశారు. పచ్చమీడియా సైతం అత్యుత్సాహంతో చిలువలు పలువులుగా కథనాలు వండి వార్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెల్లడి కావంటూ గగ్గొలు పెట్టింది.

సీబీఐ విచారణలో క్లీన్‌ చిట్‌

కోర్టులో ఫైళ్ల మిస్సింగ్‌ కేసులో ఉన్నత న్యాయస్థానం సీబీఐను విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించింది. సుమారు ఏడాది పాటు సీబీఐ విచారణ చేపట్టి చివరకు కాకాణికి కోర్టులో ఫైళ్ల మిస్సింగ్‌లో పాత్ర లేదని క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అయితే పచ్చ మీడియా సాక్షాత్తు సీబీఐ దర్యాప్తు పైనా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, కథనాలు వండి వార్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ ఉండడంతో కాకాణి కోర్టుకు రానున్నారని తెలిసి పచ్చ మీడియా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ప్రాంగంణంలో పడిగాపులు పడ్డారు. వీరిని న్యాయవాదులతోపాటు కోర్టుకు వచ్చిన వారందరూ చూసి ఏం ఖర్మరా బాబు మీకు అంటూ మాట్లాడడం గమనార్హం. చివరకు కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్‌ కోర్టుకు బదిలీ చేశారని తెలుసుకుని నిట్టూర్పులతో పచ్చమీడియా వెనుదిరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement