డీసీపల్లిలో 318 పొగాకు బేళ్ల విక్రయం | - | Sakshi
Sakshi News home page

డీసీపల్లిలో 318 పొగాకు బేళ్ల విక్రయం

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 318 బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్‌కుమార్‌ తెలిపారు. వేలానికి 413 బేళ్లు రాగా 318 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 43474.2 కిలోల పొగాకును విక్రయించగా రూ.9924534.60 వ్యాపారం జరిగింది. గరిష్టంగా కిలోకు రూ.250, కనిష్ట ధర రూ.210 లభించింది. సగటు ధర 228.29గా నమోదైంది. వేలంలో 8 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు.

ఔత్సాహిక మహిళా

వ్యాపారవేత్తల గుర్తింపు

నెల్లూరు(పొగతోట): ప్రతి గ్రామ సంఘం నుంచి 15 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను గుర్తించామని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి శిక్షణ, నైపుణ్యం, రుణాలు మంజూరు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం మహిళల అర్హతను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తామన్నారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను నిర్దేశిస్తామన్నారు. జిల్లాలోని 3,54,361 మంది గ్రూపు సభ్యులు ఉండగా 3,49,565 మందికి రుణాలు, జీవనోపాధుల సమాచారాన్ని సీఆర్పీలు నమోదు చేశారన్నారు. వార్షిక రుణాలు, జీవనోపాధుల ప్రణాళికలు 99 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. వీఓఏ, సీసీ, ఏపీఎం లాగిన్‌లో సభ్యులకు మంజూరు చేయాల్సిన రుణాల వివరాలు బ్యాంక్‌ల వారీగా మ్యాప్‌ చేయడం జరుగుతుందని తెలిపారు.

పేదల సొంతింటి కలలు

కూటమి భగ్నం

మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు: రాష్ట్రంలో పేదల సొంతింటి కలలను సాకారం చేయడంలో కూటమి ప్రభు త్వం నిర్లక్ష్యం ధోరణి అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే మేక పాటి విక్రమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సకాలంలో వినియోగించకపోవడంతో పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. సొంతింటి కలలను భగ్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా సుమారు రూ.200 కోట్లు నిధులు వినియోగం కాకుండా నిలిచిపోయాయని మేకపాటి విమర్శించారు. పేదలు ఇప్పటికే నిర్మాణం చేపట్టిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా ఆలస్యం చేయడం అమానుషమన్నారు. గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లను కూడా పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. అధికారులు రూపొందించిన ప్రణాళికలను కూడా పట్టించుకోకుండా, కేంద్ర నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. దీని వల్ల పేదల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులు ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయకుండా, నిధులను తిరిగి కేంద్రానికి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆయన ఆరోపించారు. ఇది పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

శ్రీవారి దర్శనానికి

8 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవా రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,085 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement