కావలి రూరల్: కావలి మున్సిపాలిటీలో విలీనమైన ముసునూరులో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను కొందరు కబ్జాకోరులు ఆక్రమించి ఏకంగా ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటికే మందాటి చెరువు, రాళ్లగుట్ట పోరంబోకు భూములు వందలాది ఎకరాలు కబ్జాకోరుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. ఇంత జరుగుతున్నా.. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు భారీ మొత్తాల్లో ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో సుమారు రూ.3 కోట్లు విలువైన భూమిని ఆక్రమించి పాట్లు వేసి విక్రయాలు చేయడంతో అక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం పంచాయతీగా ఏర్పడిన ముసునూరు ఇటీవల కావలి మున్సిపాలిటీలో విలీనం అయింది. ఈ ప్రాంతం జాతీయ రహదారికి పక్కనే ఉండడంతోపాటు జీఎన్‌టీ రోడ్డుకు అటూఇటూగా ఉండడంతో ఇక్కడి స్థలాలు ఖరీదుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ స్థలాలను కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. తాజాగా జీఎన్‌టీ రోడ్డుని ఆనుకొని ఉన్న అయ్యప్ప గుడి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబరు 911, 911/2లోని సుమారు 122 అంకణాలను ఆక్రమించారు. ఒక్కొక్కటి 12 అంకణాలుగా 10 ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. ఇక్కడ అంకణం ధర సుమారు రూ.2.50 లక్షలపైమాటే. ఈ లెక్కన దీని విలువ సుమారు రూ.3 కోట్లకు పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే అక్రమార్కులు ఈ భూములను కావలిలో రిజిస్ట్రేషన్ చేయించుకుండా అల్లూరులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలుస్తోంది. అసలు సర్వే నంబర్లు కాకుండా 918/2, 920 నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పటికే ఈ సర్వే నంబర్లకు పక్కనే ఉన్న సర్వే నంబరు 914లో మర్రిచెట్టు కాలనీలో చెరువు పోరంబోకు స్థలం ఉండగా దాన్నీ కబ్జాదారులు ఆక్రమించి గృహాలను నిర్మించుకున్నారు. రైల్వే ట్రాక్ నుంచి వరద నీరు పారే గుడ్డి తూము సర్వే నంబర్ 908లోని భూమి కూడా ఆక్రమణలకు గురికావడంతో పూర్తిగా కనుమరుగైంది. పై నుంచి వర్షపు వరదనీరు ప్రవహించేందుకు వీలుగా పూర్వీకులు నిర్మించిన ఈ కాలువను ఆక్రమించడంతో భారీ వర్షాలు కురిస్తే మర్రిచెట్టు సంఘం పూర్తిగా నీట మునిగే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పాలకులు ముసునూరులో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇప్పటికే పలు సర్వే నంబర్లలో
భూముల ఆక్రమణ, రిజిస్ట్రేషన్లు
కబ్జా కోరల్లో మందాటి చెరువు, రాళ్లగుట్ట పోరంబోకు భూములు
చోద్యం చూస్తున్న అధికారులు, పాలకులు


