వైభవంగా ధ్వజారోహణ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ధ్వజారోహణ

May 9 2026 7:20 AM | Updated on May 9 2026 7:20 AM

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున సమేత కామాక్షితాయి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, స్వస్తి వాచనం, దేవత ఆహ్వానం, బేరి పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజ పటానికి ఆవాహన పూజ చేసి, ధ్వజ స్తంభానికి సంప్రోక్షణ చేశారు. మంగళహారతి, మంత్రపుష్పంతో కార్యక్రమం కొనసాగింది. స్వామివారి ధ్వజస్తంభం వద్ద నంది, త్రిశూలం, డమరుకం గుర్తులను ఏర్పాటు చేసి ధర్మసూత్రంతో ధ్వజారోహణ నిర్వహించారు. అమ్మవారి ధ్వజస్తంభం వద్ద సింహం, త్రిశూలం గుర్తులతో ధ్వజపటాన్ని ఆవాహన చేసి ధ్వజారోహణ చేశారు. ఈ కార్యక్రమానికి శివకుమార్‌ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కోడి ముద్దల ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ తిరువూరు అశోక్‌ రెడ్డి, సహాయ కమిషనర్‌ వెంకట శ్రీనివాసులురెడ్డి, పాలక మండలి సభ్యులు శివకృష్ణ, వరలక్ష్మి, చాముండేశ్వరి, ప్రత్యూష, శ్రీనివాసులు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement