సాక్షి, టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. అధికారం అండతో జాతీయ రహదారి అనుకుని ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ పాగా వేస్తున్నారు. విలువైన స్థలాలను దర్జాగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు.
భూముల ధరలకు రెక్కలు రావడంతో..
సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం మండలంలో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూముల ధరలు కొన్నేళ్ల నుంచి విపరీతంగా పెరిగాయి. ఒక్కో అంకణం ధర రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకుపైగా పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన నిర్మాణాలు చేపడితే వ్యాపారానికి అనువుగా ఉండడంతో అక్రమార్కుల కన్ను విలువైన ప్రభుత్వ భూములపై పడింది. సర్వేపల్లి ముఖ్యనేత అండతో దర్జాగా ప్రభుత్వ భూములు ఆక్రమించి చకచకా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
● వెంకటాచలం మండలం ఎర్రగుంట వద్ద జాతీ య రహదారి ఆనుకుని సుమారు రూ.50 కోట్ల విలువ చేసే మూడెకరాల ప్రభుత్వ భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి కొంత భూమిని జేసీబీతో చదును చేయించి పనులు చేస్తున్నారు. సర్వేపల్లి ముఖ్యనేత అండతోనే ఈ భూ ఆక్రమణలకు దిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
● గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహ దారి ఆనుకుని పోతురాజు చెరువు ఉంది. జాతీయ రహదారి, చెరువుకు మధ్యలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఈ విలువైన స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తే వ్యాపారాలకు అనువుగా ఉంటుందని వాటిపై కొందరు కన్నేశారు. కాకుటూరు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి అండతో రూ.1.50 కోట్ల విలువ చేసే సుమారు 150 అంకణాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. రెండు చెరువులకు సాగునీరు సరఫరా చేసే పంట కాలువను సైతం ఆక్రమించి ధ్వంసం చేశారు. ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపడుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు.
● కాకుటూరు గ్రామంలో సర్వే నంబర్లు 84,85 లలో ఉన్న రూ.2కోట్ల విలువ చేసే 0.36 సెంట్ల ప్రభుత్వ భూమిని నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత ఇటీవల ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈ విషయంపై స్థానికులు పలు దఫాలు రెవెన్యూ, ఇరిగేషన్, అధికారులకు ఫిర్యాదు చేశారు.
వెంకటాచలంలో హద్దు మీరుతున్న తమ్ముళ్ల భూకబ్జాలు
ఆక్రమణల చెరలో రూ.కోట్ల
విలువ చేసే ప్రభుత్వ భూములు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
ఆక్రమణదారులపై చర్యలేవీ?
కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను టీడీపీ నేతల అండతో కొందరు దర్జాగా ఆక్రమించడాన్ని స్థానికులు చూసి విస్తుపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆక్రమణలకు గురికాకుండా కాపాడుకుంటూ వచ్చిన విలువైన భూములు కబ్జా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు తలదాచుకునేందుకు సెంటు భూమిలో గుడిసెలు వేస్తే వెంటనే వాలిపోయి తొలగించే అధికారులు కోట్ల విలువ చేసే స్థలాలను దర్జాగా ఆక్రమిస్తే చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ కాలువ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామ చెరువులకు సాగునీరు సక్రమంగా అందదని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కాకుటూరులోని సర్వే నంబర్లు 84,85లోని ప్రభుత్వ భూమి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులకు సర్వేపల్లి ముఖ్యనేత అండదండలు ఉండడంతో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


