నెల్లూరు(అర్బన్): ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాలు, అంటువ్యాధుల విజృంభణ, యుద్ధాలు.. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ముందుండి సేవలందించే సంస్థగా రెడ్‌క్రాస్ గుర్తింపు పొందింది. మే 8వ తేదీన రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు, నోబెల్ శాంతి బహుమతి గృహీత హెన్రీ డ్యూనాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. సేవలతో మానవత్వానికి ప్రతీకగా రెడ్‌క్రాస్ నిలుస్తోంది.
ఇలా మొదలై..
1859లో ఇటలీలో జరిగిన సోల్ఫెరీనో యుద్ధంలో గాయపడిన సైనికుల దుస్థితిని చూసి హెన్రీ డ్యూనాంట్ వారికి సేవలందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థ అవసరాన్ని గుర్తించారు. ఈ ఆలోచనే 1863లో అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ ఏర్పాటుకు దారితీసింది. భారతదేశంతోపాటు నేడు 190 దేశాల్లో సేవలు కొనసాగుతున్నాయి.
సేవే పరమావధిగా..
రెడ్‌క్రాస్ ప్రధానంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంది. ప్రథమ చికిత్స శిక్షణను చేపడుతుంది. వరదలు, తుఫాన్, భూకంపాలు వచ్చినప్పుడు అనాథలు, వృద్ధులకు సేవలందించడంలో, ఆశ్రయం కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. నెల్లూరు నగరంలో ఎంతోమంది దాతల సాయంతో రెడ్‌క్రాస్ స్థాపించబడింది. నేడు రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. జిల్లా రెడ్‌క్రాస్ సంస్థ ఎన్నో అవార్డులు అందుకుంది. వాటిలో ప్రధానంగా బ్లడ్‌బ్యాంక్, తలసేమియా చికిత్స కేంద్రం, కేన్సర్ ఇన్‌స్టిట్యూట్, సింహపురి సంజీవిని జెనరిక్ మందుల షాపు, యూత్ రెడ్‌క్రాస్, పల్లిపాడులోని పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం, ఏఆర్‌వీ కేంద్రం, ప్రకృతి విపత్తుల సంస్థ ఇలా 14 ప్రాజెక్ట్‌లున్నాయి.
అంతా తామై..
ప్రధానంగా కేన్సర్ ఆస్పత్రి ద్వారా, బ్లడ్‌బ్యాంక్ ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 30 వేల మంది రోగులను ఆదుకుంటోంది. అలాగే వరదలు, కరోనా లాంటి విపత్కర సమయాల్లో నెల్లూరు రెడ్‌క్రాస్ సేవలకు ఎంతో ఘన కీర్తి ఉంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రక్తసంబంధీకులు సైతం తమ వారి మృతదేహాలను ఖననం చేసేందుకు ముందుకు రాకపోతే రెడ్‌క్రాస్ నేతలు, వలంటీర్లు అంతా తామై గౌరవప్రదంగా అంత్యక్రియలు చేశారు. రోజూ అన్నదానం చేస్తూ లక్షలాది మంది ఆకలి తీర్చారు. అలాగే రవాణా లేక సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్తున్న కార్మికులకు ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి వారి రవాణాకు బస్సులు ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ స్వచ్ఛంద రక్తదానాన్ని రెడ్‌క్రాస్ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గవర్నర్, మంత్రుల చేతుల మీదుగా నెల్లూరు రెడ్‌క్రాస్ అవార్డులు దక్కించుకుంటూ సేవల్లో ముందు వరుసలో ఉంది.
యుద్ధభూమి నుంచి
ప్రారంభమైన సేవలు
నెల్లూరులో 14 ప్రాజెక్ట్‌లు
రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానం
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం నేడు


