నెల్లూరు(అర్బన్): మాతృ, శిశు ఆరోగ్య సేవలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నాణ్యమైన వైద్య సేవలందించేందుకు కిమ్స్ కడల్స్ విభాగాన్ని ప్రారంభిస్తున్నామని కిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రి యూనిట్ హెడ్ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె వివరాలను హాస్పిటల్లో వివరించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్‌మెంట్, ఆధునిక ఎన్‌ఐసీయూ (నియోనేటల్), 24 గంటలు అత్యవసర సేవలు అందించడం జరుగుతుందన్నారు. తల్లీశిశువు సురక్షితంగా ఉండేందుకు ఆధునిక లేబర్ రూమ్స్, అత్యాధునిక వైద్యపరికరాలు, భద్రతా ప్రమాణాలతో కిమ్స్ కడల్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.భాస్కర్‌రావు ఆధ్వర్యంలో వైద్యుల సమక్షంలో శనివారం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభిస్తామన్నారు.
జనారణ్యంలోకి చుక్కలదుప్పి
ఉదయగిరి: దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి చుక్కలదుప్పి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపానికి గురువారం ఉదయం వచ్చింది. కుక్కలు దాడి చేసేందుకు దానిని వెంబడించాయి. గమనించిన వైద్యశాల సెక్యూరిటీ సిబ్బంది కుక్కల బారినుంచి దుప్పిని రక్షించారు. అనంతరం అటవీ రేంజ్ అధికారి బీఎస్ కుమార్‌రాజాకు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించి దుప్పికి నీరు తాగించి, గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక పశువైద్యశాలకు తరలించారు. చికిత్స తర్వాత దుప్పిని దుర్గం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
అదుపుతప్పి
కోళ్ల వ్యాన్ బోల్తా
● డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
● సుమారు 700 కోళ్ల మృతి
దగదర్తి: చిత్తూరు నుంచి చీరాలకు వెళ్తున్న ఐషర్ వ్యాన్ గురువారం తెల్లవారుజామున అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. సుమారు 700 కోళ్లు మృతిచెందాయి. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్ద ఏర్పాటుచేసిన మలుపు దగ్గరకు రాగానే అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. హైవే మొబైల్ సిబ్బంది, దగదర్తి పోలీసులు వంతెనపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.
రాష్ట్ర స్థాయి బీచ్
కబడ్డీ పోటీలు ప్రారంభం
సంగం: మండలంలోని దువ్వూరు గ్రామంలో 13వ రాష్ట్రస్థాయి పురుషుల, మహిళ బీచ్ కబడ్డీ చాంపియషిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, టీడీపీ నాయకురాలు ఆనం లీలా కై వల్య హాజరై క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, నాయకులు, యువత, పరిసర గ్రామాల ప్రజలు భారీగా విచ్చేశారు. నాలుగు రోజులపాటు పోటీలను 15 మంది టెక్నికల్ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.
ప్రజాభిప్రాయం మేరకే అనుమతులు
● జేసీ వెంకటేశ్వర్లు
సైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్‌కు అనుమతులు ఇస్తామని జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక కృష్ణా మైకా మైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొలకలపూండ్ల, చాగణం రెవెన్యూ పరిఽధిలోని సర్వే 528, 505లో 10.02 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యావరణ అనుమతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంట్ అధికారి అశోక్‌కుమార్, తహసీల్దార్ సుభద్ర, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు.


