దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్‌

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

వెలుగులోకి దొంగతనాలు

రూ.7 లక్షల సొత్తు స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): దోపిడీ కేసులో నిందితులను పోలీసులు విచారించే క్రమంలో కారు, ఇంట్లో దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులను అరెస్ట్‌ చేసి సుమారు రూ.7 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష, చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ చిట్టెం కోటేశ్వరరావుతో కలిసి తన కార్యాలయంలో గురువారం నిందితుల వివరాలను వెల్లడించారు. చిట్వేలు మండలం బక్రాపురం కొత్తపల్లికి చెందిన ఈశ్వరయ్య ఈనెల రెండో తేదీ తెల్లవారుజామున నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్‌ బయట ఉండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ఎక్కడికి వెళ్లాలని ఈశ్వరయ్యను అడగ్గా చిట్వేలని చెప్పాడు. వారు తాము కడపకు వెళ్తున్నామని వస్తే వదిలిపెడతామని ఆయన్ను కారులో ఎక్కించుకున్నారు. కొద్దిదూరం తీసుకెళ్లి కత్తితో చంపుతామని బెదిరించి రూ.7,200 నగదు, సెల్‌ఫోన్‌ దోచుకెళ్లారు. ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు.

దొంతాలి క్రాస్‌రోడ్డు వద్ద..

ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో ఎస్సై అయ్యప్ప తన సిబ్బందితో కలిసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులు తిరుపతి కొర్లగుంటకు చెందిన ఎస్‌.మోహిత్‌సాయి, చంద్రగిరి మండలానికి చెందిన ఎస్‌.జయకుమార్‌, వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన పాతనేరస్తుడు పి.రాజా, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురానికి చెందిన ఎం.వెంకటరమణారెడ్డిగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం వారిని దొంతాలి క్రాస్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారించగా దోపిడీ కేసుతోపాటు తిరుపతి తూర్పు అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో షిఫ్ట్‌ డిజైర్‌ కారు, వేదాయపాళెం స్టేషన్‌ పరిధిలోని శ్రీలంక కాలనీలో ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులని అరెస్ట్‌ చేసి దోపిడీ కేసులోని రూ.7,200ల నగదు, కారు, ఇంటి దొంగతనం కేసులోని 22.230 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ చెప్పారు. రాజాపై వేంపల్లి పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉందని తెలిపారు. నిందతులని అరెస్ట్‌ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్‌స్పెక్టర్‌, ఎస్సై, క్రైమ్‌ పార్టీ హెచ్‌సీ జె.సురేష్‌బాబు, పీసీలు ఎస్‌వీ శ్యామ్‌, ఎం.సుబ్బారావు, సీహెచ్‌కె.వర్ధన్‌, ఎన్‌.దయాశంకర్‌, కె.వేణు, కె.దేవానాయుడిని ఏఎస్పీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement