గడ్డివాములు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

గడ్డివాములు దగ్ధం

May 8 2026 1:07 PM | Updated on May 8 2026 1:07 PM

రూ.10 లక్షల నష్టం

చేజర్ల: మండలంలోని మడపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో గ్రామానికి చెందిన పొదలకూరు శ్రీనివాసులు, పుట్లూరు కామయ్య, ఈగ భాస్కర్‌రెడ్డి, పొదలకూరు రమణయ్యకు చెందిన ఆరు గడ్డివాములు దగ్ధమయ్యాయి. అందరూ నిద్రలో ఉండగా ఒకసారిగా మంటలు చెలరేగి గడ్డివాములు తగలపడటంటంతో రైతులు గమనించి ఆత్మకూరు ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ గడ్డి మొత్తం కాలిపోయింది. దీంతో రూ.10 లక్షల నష్టం వాటిలినట్లుగా చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆకతాయిలు చేశారా అనే కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కాగా గత సంవత్సరం కూడా గ్రామంలో ఇదే విధంగా గడ్డివాములు దగ్ధమైన ఘటన జరిగి ఉంది. ఏది ఏమైనా మూగజీవాలు తినాల్సిన పశుగ్రాసం అగ్నికి ఆహుతవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.

బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్లు రద్దు

వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో 2023 సంవత్సరంలో విడుదల చేసిన బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్లను రద్దు చేసినట్లు వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ తీర్మానం, జీఓ ప్రకారం యూనివర్సిటీలోని 106 ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. అభ్యర్థులకు దరఖాస్తు రుసుము తిరిగి చెల్లింపునకు సంబంధించిన వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలియజేశారు.

ప్రమాదవశాత్తు కిందపడి..

యువకుడి మృతి

నెల్లూరు(క్రైమ్‌): పిట్టగోడపై కూర్చొని నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు గాయత్రినగర్‌ రెండో వీధిలో పవన్‌ సాయికుమార్‌ (26) తన భార్య, తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను నగరంలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్‌లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గర్భవతి కావడంతో బుధవారం రాత్రి ఇంట్లోనే సీమంతం చేశారు. అనంతరం సాయి బంధువులతో కలిసి మిద్దైపె నిద్రపోయాడు. గురువారం తెల్లవారుజామున ఇంట్లోకి వచ్చి వాటర్‌ బాటిల్‌ తీసుకుని మెట్లెక్కి మిద్దైపెకి వెళ్లాడు. మెట్ల చివరన ఉన్న పిట్టగోడపై కూర్చొని నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సాయికుమార్‌ను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడి తల్లి రత్నమ్మ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

ప్రత్యేక నోడల్‌ అధికారిగా కలెక్టర్‌

నెల్లూరురూరల్‌: రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సదస్సులో కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ఆయన్ను భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక నోడల్‌ అధికారిగా సీఎం చంద్రబాబు నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement